జట్టులోని ఆరుగురు ఆటగాళ్ళు సున్నాకే అవుట్ అయితే, ఆ జట్టు తిరిగి రావడం దాదాపు అసాధ్యం అవుతుంది. కానీ, ఈ అసాధ్యమైన విషయాన్ని బంగ్లాదేశ్ (Bangladesh vs Sri Lanka, 2nd Test) సుసాధ్యం చేసింది. ఢాకాలోని షేర్ బంగ్లా స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేకపోయారు. కానీ, అప్పటికీ ఈ జట్టు 365 పరుగులు చేసింది. ఇది ఓ ప్రపంచ రికార్డుగా మరింది. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఆరుగురు బ్యాట్స్‌మెన్స్ సున్నాకి ఔట్ అయిన తర్వాత ఇంత పెద్ద స్కోరు నమోదు కావడం ఇదే తొలిసారి.
24 పరుగుల వ్యవధిలో తొలి 5 వికెట్లు, 69 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు..
బంగ్లాదేశ్ 277/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించింది. తొలిరోజు సెంచరీ బ్యాట్స్‌మెన్‌లు లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్‌లు ఆటను నిదానంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే రెండో రోజు లిట్టన్ దాస్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక జట్టు స్కోరు 296 వద్ద 141 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. తొలి రోజు 24/5తో జట్టును ఆదుకున్న రహీమ్, దాస్ మధ్య 272 పరుగుల భాగస్వామ్యం ఉంది. లిట్టన్ దాస్ ఔటైన తర్వాత, ముష్ఫికర్ రహీమ్ ఒక ఎండ్‌లో నిలబడ్డాడు. కానీ, అతనికి ఇతర బ్యాట్స్‌మెన్‌ల మద్దతు లభించకపోవడంతో జట్టు మొత్తం 365 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకుంది. ముష్ఫికర్ రహీమ్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముష్ఫికర్, లిట్టన్ దాస్ మినహా, తాజియుల్ ఇస్లాం మాత్రమే రెండంకెల స్కోరును చేరుకుని, 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. తమీమ్ ఇక్బాల్, షకీబ్-అల్-హసన్ సహా ఐదుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఖాతా కూడా తెరవలేకపోయారు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్లోగా ప్రారంభం..
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 365 పరుగులకు సమాధానంగా శ్రీలంక ఓపెనర్లు నేరుగా శుభారంభం అందించారు. అతని ఓపెనర్లు ఒషాద ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఇద్దరూ అర్ధ సెంచరీలు కొట్టి మొదటి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. 57 పరుగులు చేసిన తర్వాత ఫెర్నాండో హుస్సేన్‌కు బలయ్యాడు. దీని తర్వాత కుశాల్ మెండిస్‌ను కూడా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ అవుట్ చేశాడు. దీంతో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే 70 పరుగులు చేసి నైట్ వాచ్ మెన్ రజిత ఖాతా తెరవకుండానే క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ కంటే శ్రీలంక ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది.