IND vs PAK: అండర్‌ 19 ఆసియాకప్‌లో భారత్‌కు చుక్కెదురు.. పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాభవం

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదర్శ్ సింగ్ (62), అర్షిన్ కులకర్ణి (24) శుభారంభం అందించారు.  అయితే వీరు ఔటైన తర్వాత  రుద్ర పటేల్  కేవలం ఒక పరుగు మాత్రమే చేసి  పెవిలియన్ చేరుకున్నాడు.

IND vs PAK: అండర్‌ 19 ఆసియాకప్‌లో భారత్‌కు చుక్కెదురు.. పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాభవం
India Vs Pakistan

Updated on: Dec 10, 2023 | 9:04 PM

దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ వేదికగా ఆదివారం (డిసెంబర్‌ 10) జరిగిన అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో యువ భారత్ కు చుక్కెదురైంది. పాకిస్తాన్‌తో జరిగన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పాకిస్థాన్ 47 ఓవర్లలో కేవంల రెండు వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది. అజాన్ అవైస్ 130 బంతుల్లో 10 ఫోర్లతో అజేయంగా 105 పరుగులు చేసి పాకిస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి. అంతకుముందు టీమిండియా తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. కాగా, నేపాల్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదర్శ్ సింగ్ (62), అర్షిన్ కులకర్ణి (24) శుభారంభం అందించారు.  అయితే వీరు ఔటైన తర్వాత  రుద్ర పటేల్  కేవలం ఒక పరుగు మాత్రమే చేసి  పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో జాగ్రత్తగా బ్యాటింగ్ ప్రదర్శించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ 98 బంతుల్లో 5 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక్కడి నుంచి మళ్లీ వికెట్లు పతనం కావడంతో భారత జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది. లోయర్ ఆర్డర్ లో భీకర బ్యాటింగ్ ప్రదర్శించిన సచిన్ దాస్ 42 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేసింది.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో పాకిస్థాన్ పెద్దగా ఇబ్బంది పడలేదు. అయితే ఆ జట్టుకు శుభారంభం లభించలేదు. ఎనిమిది పరుగులు చేసిన తర్వాత షమీల్ హుస్సేన్ ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత అజాన్ అవైస్, షాజైబ్ ఖాన్ బాధ్యతాయుతంగా ఆడి 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షాజైబ్ 88 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరో ఎండ్‌లో అజాన్ నిలకడగా ఆడాడు. అతనికి కెప్టెన్ సాద్ బేగ్ మద్దతు లభించింది. వీరిద్దరూ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్థాన్‌కు విజయాన్ని అందించారు. 130 బంతులు ఎదుర్కొన్న అజన్ 10 ఫోర్లు బాది 105 పరుగులతో అజేయ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. సాద్ 51 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 68 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

సెంచరీతో చెలరేగిన అజాన్ అవైస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..