
Matthew Hayden’s daughter Grace makes comic appeal to Joe Root: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ తన తండ్రి చేసిన సవాల్‌పై స్పందిస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌కు ఓ విచిత్రమైన విజ్ఞప్తి చేసింది. “దయచేసి జో రూట్.. ఒక సెంచరీ కొట్టు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాబోయే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సెంచరీ చేయకపోతే, తాను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో నగ్నంగా నడుస్తానని మాథ్యూ హేడెన్ ఇటీవల ఒక యూట్యూబ్ చర్చలో సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.
హేడెన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఆయన కుమార్తె, క్రీడా వ్యాఖ్యాత అయిన గ్రేస్ హేడెన్ హాస్యభరితంగా స్పందించింది. తన తండ్రి పరువు కాపాడాలని జో రూట్‌ను ఆమె వేడుకుంది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. “మా నాన్న చేసిన పనికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి రూట్.. ఒక సెంచరీ కొట్టి మా నాన్నను ఆ ఇబ్బంది నుంచి కాపాడు” అంటూ ఆమె సరదాగా కోరింది.
జో రూట్‌కు టెస్ట్ క్రికెట్‌లో గొప్ప రికార్డు ఉంది. ఇప్పటివరకు 39 టెస్ట్ సెంచరీలు సాధించాడు. కానీ ఆశ్చర్యకరంగా, ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క టెస్ట్ సెంచరీ కూడా సాధించలేదు. ఆస్ట్రేలియాలో 14 టెస్టులు ఆడి 892 పరుగులు చేసిన రూట్, తొమ్మిది అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ, సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. ఈ రికార్డును దృష్టిలో ఉంచుకునే హేడెన్ ఈ సరదా సవాల్ విసిరాడు.
నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్‌లో జో రూట్ సెంచరీ సాధిస్తాడా? లేక హేడెన్ తన సవాల్‌ను నెరవేర్చాల్సి వస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. గ్రేస్ హేడెన్ చేసిన ఈ విజ్ఞప్తి తర్వాత ఈ యాషెస్ సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..