Cricket Australia: యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ వివాదాల్లో కూరుకుపోయింది. శుక్రవారం టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టిమ్ పైన్ కుంభకోణమే వివాదానికి కారణం. తన సహోద్యోగికి పంపిన అసభ్యకరమైన సందేశం మీడియాలో కనిపించడంతో టిమ్ పైన్ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. టిమ్ పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.. కానీ, ఈ ఆటగాడు యాషెస్ సిరీస్‌లో ఆడాలనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ప్రకటనతో అతని కెరీర్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
టిమ్ పైన్ కేసును మీడియాకు తెలియకుండా దాచడం పెద్ద తప్పు అని క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం అంగీకరించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ రిచర్డ్ ఫ్రోయిన్ స్టెయిన్ మీడియాతో మాట్లాడుతూ, ‘2018లో తీసుకున్న నిర్ణయం గురించి నేను ఏమీ చెప్పలేను. కానీ, ఈ రోజు ఈ విషయం తెరపైకి వచ్చి ఉంటే, మేము ఆ నిర్ణయం తీసుకోలేం. ఆ నిర్ణయం తప్పుడు సందేశాన్ని పంపింది. ఆస్ట్రేలియా కెప్టెన్ క్లీన్ క్యారెక్టర్, అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ సమయంలో టిమ్ పైన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించాల్సి ఉంది’ అని పేర్కొన్నాడు.
అసభ్యకరమైన ఫోటోను మహిళకు పంపిన పైన్..
టిమ్ పైన్ 2017లో అశ్లీల సందేశాల కుంభకోణంలో చిక్కుకున్నాడని తెలిసిందే. అతను టాస్మానియా క్రికెట్‌లో పనిచేస్తున్న ఒక మహిళకు తన అసభ్యకరమైన ఫోటోలు, డర్టీ సందేశాలను పంపాడు. దీని స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో, ఈ ఆటగాడు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అనంతరం ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఏడుస్తూ అభిమానులకు టిమ్ పైన్ క్షమాపణలు కూడా చెప్పాడు. 2018లో టిమ్ పైన్‌కు టాస్మానియా క్రికెట్, క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్ చిట్ ఇచ్చింది. విచారణ ప్రకారం, ఇది టిమ్ పైన్ వ్యక్తిగత విషయమని, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిని ఏ విధంగానూ ఉల్లంఘించలేదంటూ క్లీన్‌చిట్ ఇచ్చింది.
ప్రస్తుతం టిమ్ పైన్‌ను జట్టులో కొనసాగించడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టిమ్ పైన్ కెరీర్‌లో పురోగతి కనిపించడం లేదని మాజీ వెటరన్ క్రికెటర్ మార్క్ వా అన్నాడు. అదే సమయంలో, టిమ్ పైన్ శుక్రవారమే పదవీ విరమణ చేసి ఉండాల్సిందని ఎడ్ కోవెన్ తెలిపాడు. అయితే, టిమ్ పైన్ ఇప్పటికీ ఆస్ట్రేలియా జట్టులో కొనసాగాలని, అదే సమయంలో యాషెస్‌లో ఆడాలని కోరుకుంటున్నాడు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ స్టేట్ మెంట్ ఇచ్చిన తీరు చూస్తే టిమ్ పైన్ కెరీర్ చిక్కుల్లో పడినట్లే. డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ని కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ రేసులో పాట్ కమిన్స్ ముందంజలో ఉన్నాడు.