IND vs AUS: యువ భారత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. రెండు టెస్ట్‌ల్లోనూ ఘోర పరాజయం

|

Nov 09, 2024 | 4:05 PM

IND vs AUS: ఇండియా-ఎ వర్సెస్ ఆస్ట్రేలియా-ఎ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 3 రోజుల్లోనే ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఎ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND vs AUS: యువ భారత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. రెండు టెస్ట్‌ల్లోనూ ఘోర పరాజయం
Inda Vs Ausa
Follow us on

INDA vs AUSA: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌కు ముందు, ఆతిథ్య ఆస్ట్రేలియా, భారతదేశాలకు చెందిన A జట్ల మధ్య జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఎ 6 వికెట్ల తేడాతో భారత్-ఎపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన టీమిండియా.. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.

బ్యాట్స్‌మెన్స్ వైఫల్యం..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే భారత్ ఎ జట్టు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా తొలి మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ లోనూ భారత్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. తద్వారా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌటైంది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో 62 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత బ్యాట్స్‌మెన్ పుంజుకుంటారని అంతా భావించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్స్‌మెన్స్ పేలవ ప్రదర్శన చేశారు.

దీంతో భారత్-ఏ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరకు ఆస్ట్రేలియా జట్టుకు 168 పరుగుల విజయ లక్ష్యం లభించింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఆస్ట్రేలియాను ఓడించాలనే ఉద్దేశంతో ఉన్న భారత జట్టుకు పేసర్లు రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం అందించారు. కేవలం ఒక్క పరుగుకే రెండు ఆస్ట్రేలియా వికెట్లు పడగొట్టాడు. 73 పరుగులకు చేరుకునే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత భారత బౌలర్లు వికెట్ల కోసం ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. దీంతో చివరికి ఆస్ట్రేలియా మరో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

టీమ్ ఇండియాకు పెరిగిన తలనొప్పి..

ఈ మ్యాచ్‌లో అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్, ధృవ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ద్ కృష్ణ భారత్ ఎ జట్టులో ఉన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ మినహా మిగతా ఆటగాళ్లెవరూ రాణించలేకపోయారు. కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 14 పరుగులు చేశాడు. అదే సమయంలో, అభిమన్యు ఈశ్వరన్ కూడా రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేశాడు. కానీ, రెండో టెస్టులో ఆడే అవకాశం దక్కించుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించి అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు.

తద్వారా తొలి టెస్టుకు రోహిత్ శర్మ లేకపోవడంతో రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌ను స్టార్టర్‌గా ఆడాలని భావించిన మేనేజ్‌మెంట్‌కు వీరిద్దరి పేలవ ఫామ్ పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఇద్దరిలో ఒక్కరైనా చెప్పుకోదగ్గ ఆటతీరు కనబరిచి ఉంటే.. ఆసీస్‌తో జరిగే తొలి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి అవకాశం లభించేది. మరి మేనేజ్‌మెంట్ జట్టును ఎలా ఎంపిక చేస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..