Asia Cup : ఒకట్రెండు రోజుల్లో భారత్‎కు ఆసియా కప్ ట్రోఫీ..లేకపోతే అదే చేస్తామంటూ బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వడంలో ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జాప్యంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 4న ఈ సమస్యను ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయం. మరోవైపు, గువహతి టెస్ట్‌లో సూర్యోదయం కారణంగా లంచ్‌కు ముందు టీ బ్రేక్ ఉండే కొత్త నిబంధన అమలు చేయాలని యోచిస్తున్నారు.

Asia Cup : ఒకట్రెండు రోజుల్లో భారత్‎కు ఆసియా కప్ ట్రోఫీ..లేకపోతే అదే చేస్తామంటూ బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
Asia Cup Trophy

Updated on: Nov 01, 2025 | 8:53 AM

Asia Cup : టీమిండియా సెప్టెంబర్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి ఆసియా కప్ ఫైనల్‌లో విజేతగా నిలిచి నెల రోజులు దాటినా, ఆసియా కప్ విజేత ట్రోఫీ, మెడల్స్ ఇప్పటికీ బీసీసీఐ కార్యాలయానికి చేరలేదు. ఏసీసీ, పీసీబీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించడంతో ఆ ట్రోఫీని మైదానం నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ వివాదంపై బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవ్ జిత్ సైకియా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లోగా భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే, నవంబర్ 4న జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు హెచ్చరించారు.

భారత జట్టు ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ గెలిచింది. అయితే, ట్రోఫీని విజేతకు అందించడంలో నెల రోజులకు పైగా జాప్యం జరుగుతుండటంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్‌కు చెందిన ఏసీసీ, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించారు. దీనితో పాటు, ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు.

ట్రోఫీని మరొకరి చేతుల మీదుగా భారత జట్టుకు అందించడానికి నఖ్వీ ఇష్టపడలేదు. ట్రోఫీని తానే ఇవ్వాలని, లేకపోతే ఏసీసీ కార్యాలయంలోనే దాన్ని తీసుకోవాలని ఆయన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ట్రోఫీ విషయంలో ఏసీసీ వైఖరి మారకపోవడంతో బీసీసీఐ ఈ అంశాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవ్ జిత్ సైకియా మాట్లాడుతూ, “నెల రోజులు గడుస్తున్నా ట్రోఫీని ఇవ్వకపోవడం సరికాదు. మేము ఏసీసీ ఛైర్మన్‌కు లేఖ కూడా రాశాం, కానీ ఆయన వైఖరిలో మార్పు లేదు. ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లోగా ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి పంపాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

ట్రోఫీ త్వరగా అందకపోతే, నవంబర్ 4న దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశంలో ఈ సమస్యను ప్రస్తావించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది. ట్రోఫీ తప్పకుండా భారత్‌కు వస్తుందని, కేవలం సమయం మాత్రమే ఆలస్యం అవుతోందని సైకియా విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆసియా కప్ ట్రోఫీ వివాదం ఒకవైపు ఉండగా, భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన మార్పుకు గువహతి టెస్ట్ వేదిక కానుంది. రాబోయే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ గువహతిలో జరగనుంది. ఈశాన్య ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా అవుతున్న కారణంగా, రోజుకు ఆరు గంటల ఆటను పూర్తి చేయడానికి ఆట సమయాల్లో మార్పులు చేయాల్సి వస్తుంది. మ్యాచ్‌ను ముందుగా ప్రారంభిస్తే, అది సాధారణ లంచ్ సమయానికి సరిపోకపోవచ్చు. అందుకే, సెషన్స్‌ను మార్చుకుని సాంప్రదాయంగా ఉండే లంచ్ సమయాన్ని టీ బ్రేక్ సమయంతో మార్చుకునే అవకాశం ఉంది. అంటే, లంచ్‌కు ముందు టీ బ్రేక్ ఉండేలా కొత్త నియమాన్ని అమలు చేయాలని చర్చలు జరుగుతున్నాయి. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..