Asia Cup 2025: ఒమన్‌పై బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్‌ సూర్య..! కారణం ఇదే

ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 188 పరుగులతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ 38 పరుగులతో చెలరేగగా, సంజు శాంసన్ 56 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు.

Asia Cup 2025: ఒమన్‌పై బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్‌ సూర్య..! కారణం ఇదే
Suryakumar Yadav

Updated on: Sep 19, 2025 | 10:08 PM

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎప్పటిలాగే అదిరిపోయే స్టార్‌ అందించాడు. కేవలం 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు సాధించాడు. అయితే మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఫెయిల్‌ అయ్యాడు. ఇక వన్‌ డౌన్‌లో రావాల్సిన సూర్య తన ప్లేస్‌ను సంజు శాంసన్‌కు ఇచ్చాడు.

అయితే కెప్టెన్‌ తన కోసం చేసి త్యాగానికి న్యాయం చేస్తూ సంజు శాంసన్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. అయితే తన వన్‌ డౌన్‌ను శాంసన్‌కు ఇచ్చిన సూర్య తర్వాత అయిన బ్యాటింగ్‌కు వస్తాడని అనుకుంటే.. టీమిండియా 8 వికెట్లు కోల్పోయిన కూడా క్రీజ్‌లోకి రాలేదు. చివరికి హర్షిత్‌ రాణా, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌ కూడా బ్యాటింగ్‌కు వచ్చారు. కానీ కెప్టెన్‌ సూర్య మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు. ఇది క్రికెట్‌ అభిమానులకు కాస్త షాకింగ్‌గా అనిపించింది.

ఇది నామామాత్రపు మ్యాచ్‌ అని మిగతా బ్యాటర్లకు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చాడని అనుకోవచ్చు. కానీ, తాను రాకుండా బౌలర్లను కూడా బ్యాటింగ్‌కు పంపడం ఎవరికీ అర్థం కాలేదు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన సూర్య.. తనకు కావాల్సినంత బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించిందని భావించి, మిగతా వారికి అవకాశం ఇచ్చాడని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. పైగా ఈ ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌ ఉంది. ఆ మ్యాచ్‌కు కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్‌ ఉండటంతో సూర్య రెస్ట్‌ తీసుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి