
Asia Cup 2025 : క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 10న యూఏఈతో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. అయితే, సెప్టెంబర్ 14న జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనందున, ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీలలో తలపడినప్పుడు అంచనాలు భారీగా పెరుగుతాయి. ఈసారి కూడా పరిస్థితులు వేరేగా ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ కోసం ప్రకటనల డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్-పాకిస్తాన్ మధ్య జరగనుంది. సాధారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్‌లో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి కూడా భారత్-పాక్ మ్యాచ్‌పై భారీ డిమాండ్ నెలకొంది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రసారదారులు కూడా సిద్ధమయ్యారు.
ఆసియా కప్ 2025 మీడియా హక్కులు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా సొంతం చేసుకుంది. టీవీలో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, లైవ్ స్ట్రీమింగ్ సోనీ లివ్ యాప్‌లో ప్రసారమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రసారదారులు అడ్వర్టైజ్‌మెంట్ రేట్లను భారీగా పెంచారు. ముఖ్యంగా భారత్ ఆడే మ్యాచ్‌లకు, అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అత్యధిక ధరలను నిర్ణయించారు.
బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. సోనీ నెట్‌వర్క్ భారత మ్యాచ్‌ల కోసం ప్రతి 10 సెకన్ల ప్రకటనకు రూ. 14 నుంచి 16 లక్షలు నిర్ణయించింది. అంటే, కంపెనీలు తమ యాడ్స్‌ను భారత్-పాక్ మ్యాచ్‌లో ప్రసారం చేయాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కేవలం టీవీ ప్రకటనలకే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా యాడ్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
టీవీలో ప్రెజెంటింగ్ స్పాన్సర్‌షిప్‌కు రూ. 18 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌కు రూ. 13 కోట్లు నిర్ణయించారు. అలాగే, లైవ్ స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ కోసం కో-ప్రెజెంటింగ్, హైలైట్స్ పార్టనర్‌షిప్‌కు ఒక్కో కంపెనీకి రూ. 30 కోట్లు, కో-పవర్డ్ బై ప్యాకేజీకి రూ. 18 కోట్లుగా రేట్లు ఖరారు చేశారు. డిజిటల్ ప్రకటనలలో 30 శాతం కేవలం భారత్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ చేశారు.
సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరిగే ఈ ఏషియా కప్ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఆడతాయి. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో, రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో ఆడనుంది. ఒకవేళ ఇరు జట్లు సూపర్ 4కు చేరుకుంటే, అక్కడ మరోసారి తలపడతాయి. ఇక, ఫైనల్‌కు కూడా చేరితే, ఈ టోర్నమెంట్‌లో భారత్-పాక్ మధ్య మొత్తం మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌లతో ప్రసారదారుల పంట పండినట్లే.
గ్రూప్-ఎ: ఇండియా, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ
గ్రూప్-బి: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..