Asia Cup 2022: అతను ఫామ్‌లోకి వస్తే తలనొప్పిగా మారతాడు.. పాక్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మాజీ క్రికెటర్
India Vs Pakistan, Asia Cup 2022: భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల దృష్టి ఆ మరుసటి రోజే (ఆగస్టు 28) జరిగే భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లను పక్కన పెడితే ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పైచేయి.
India Vs Pakistan, Asia Cup 2022: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆసియా కప్-2022 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈనెల 27న యూఏఈ వేదికగా ఈ మల్టీ నేషన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఇక భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల దృష్టి ఆ మరుసటి రోజే (ఆగస్టు 28) జరిగే భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లను పక్కన పెడితే ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పైచేయి. అయితే గత కొన్నేళ్లుగా ఇది మారుతూ వస్తోంది. గతడాది ఇదే గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్, అంతకు ముందు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ పాక్ చేతిలో ఓడిపోయింది. దీంతో దాయాదిపై ఈసారైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది.
రిజర్వ్ బెంచ్ పటిష్ఠంగా ఉంది..
కాగా రోహిత్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వరుస విజయాలు సాధిస్తోంది. దీనికి తోడు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు జట్టులోకి పునరాగమనం చేయడంతో టీమిండియాను ఆపడం కష్టమేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా ఇదే చెబుతున్నాడు. ‘ రొటేషన్ పాలసీతో భారత్ తమ ఆటగాళ్లందరినీ పరీక్షిస్తోంది. తద్వారా రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసుకుంటోంది. ఇక విరాట్ విషయంలో పాక్ అలసత్వం ప్రదర్శించకూడదు. కోహ్లి విజృంభిస్తే బాబర్ బృందానికి ఇక్కట్లు తప్పవు. విరాట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవముంది. అతని శక్తి సామర్థ్యాలేమిటో అందరికీ తెలుసు. అయితే కోహ్లీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతను వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని టీమిండియా భావిస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారతాడు’ అని తమ జట్టుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు సల్మాన్.