Ashes 2023: బెన్‌ స్టోక్స్‌ సూపర్‌ సెంచరీ వృథా.. లార్డ్స్‌ టెస్టులోనూ ఆసీస్‌దే విజయం

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయ పరంపర కొనసాగుతోంది. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన లార్డ్స్‌ టెస్టులోనూ ఆసీస్‌ 43 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. 372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 327 పరుగులకు ఆలౌటైంది.

Ashes 2023: బెన్‌ స్టోక్స్‌ సూపర్‌ సెంచరీ వృథా.. లార్డ్స్‌ టెస్టులోనూ ఆసీస్‌దే విజయం
England Vs Australia

Updated on: Jul 02, 2023 | 9:17 PM

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయ పరంపర కొనసాగుతోంది. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన లార్డ్స్‌ టెస్టులోనూ ఆసీస్‌ 43 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. 372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 327 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (155, 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీ చేసినా ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. స్టార్క్‌, కమిన్స్‌, హాజిల్‌ వుడ్‌ తలా 3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. కాగా ఆదివారం ఆటలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ చివరి రోజున ఇంగ్లండ్ 257 పరుగులు చేయాల్సి ఉండగా 6 వికెట్లు మిగిలాయి. చివరి రోజు ఆటను స్టోక్స్‌తో కలిసి బెన్ డకెట్ ప్రారంభించాడు. మొదటి గంటన్నరలో, స్టోక్స్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. అయితే డకెట్ మాత్రం వేగంగా ఆడాడు. అయితే మరోసారి తొలి ఇన్నింగ్స్‌లో లాగే సెంచరీ మిస్ చేసుకున్నాడు. 83 పరుగులు చేసిన డకెట్‌ జోష్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యారీకి చిక్కాడు. ఇక్కడి నుంచే అసలు డ్రామా మొదలైంది. జానీ బెయిర్‌స్టో అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అయితే బెయిర్‌ స్టో డెడ్‌ బాల్‌గా భావించి క్రీజు నుంచి బయటకు వచ్చాడు. దీంతో వెంటనే అలెక్స్ కారీ వికెట్లను గిరాటేశాడు. దీంతో ఈ రనౌట్‌పై దుమారం రేగింది. ఇది మొత్తం లార్డ్స్ వాతావరణాన్ని మార్చింది. అందరూ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు.

ఈ రనౌట్‌ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడ్ కూడా మార్చేసింది. ఆ సమయంలో కేవలం 126 బంతుల్లో 62 పరుగులు మాత్రమే ఆడుతున్న స్టోక్స్ 16 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ 38 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ ఓవర్లో స్టోక్స్ వరుసగా 3 సిక్సర్లతో అద్భుత సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ తర్వాత కూడా స్టోక్స్ తన దాడిని కొనసాగించాడు. వేగంగా 150 పరుగులు పూర్తి చేశాడు. అలాగే స్టువర్ట్‌ బ్రాడ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. అయితే 155 పరుగుల వద్ద హాజిల్‌వుడ్ వేసిన షార్ట్ బాల్‌ను భారీ షాట్‌ కొట్టే యత్నంలో క్యారీకి చిక్కాడు స్టోక్స్‌. ఆ తర్వాత 3 వికెట్లు త్వరగా పడిపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తరఫున స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్ 3-3 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ తన స్వదేశంలో వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అంతకుముందు 2008లో దక్షిణాఫ్రికా వరుసగా రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం  క్లిక్ చేయండి..