AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh: షమీ, శ్రీనాథ్ సరసన అర్ష్‌దీప్.. న్యూజిలాండ్ గడ్డపై అరుదైన రికార్డు

Arshdeep Singh: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీసి ప్రత్యేక ఘనత సాధించాడు. న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో జవగళ్ శ్రీనాథ్, మహమ్మద్ షమీ ముందున్నారు.

Arshdeep Singh: షమీ, శ్రీనాథ్ సరసన అర్ష్‌దీప్.. న్యూజిలాండ్ గడ్డపై అరుదైన రికార్డు
Arshdeep Singh
Rakesh
|

Updated on: Nov 04, 2026 | 2:50 PM

Share

Arshdeep Singh: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదరగొట్టాడు. తన పదికి పది ఓవర్లు వేసి 70 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో నాలుగు వికెట్ల ఘనత సాధించిన మూడో భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ ఘనతను భారత మాజీ పేసర్లు జవగళ్ శ్రీనాథ్, మహమ్మద్ షమీ మాత్రమే అందుకున్నారు. దీంతో అర్ష్‌దీప్ కూడా ఈ ఇద్దరు దిగ్గజాల సరసన చేరాడు.

శ్రీనాథ్ ఖాతాలో రెండు అద్భుత స్పెల్స్

ఈ జాబితాలో జవగళ్ శ్రీనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 1995లో నేపియర్ వేదికగా జరిగిన వన్డేలో శ్రీనాథ్ 52 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2003లో ఆక్లాండ్‌లోనే జరిగిన మ్యాచ్‌లో మరింత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 23 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ గడ్డపై భారత ఫాస్ట్ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఈ స్పెల్ ఇప్పటికీ ముందువరుసలో ఉంది. ఈ రెండు ప్రదర్శనలతో శ్రీనాథ్ ఈ రికార్డు జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

షమీ తర్వాత ఇప్పుడు అర్ష్‌దీప్

మహమ్మద్ షమీ కూడా న్యూజిలాండ్‌లో తన బౌలింగ్‌తో ప్రత్యేక ముద్ర వేశాడు. 2014లో నేపియర్‌లో జరిగిన వన్డేలో 55 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో శ్రీనాథ్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత పేసర్‌గా నిలిచాడు. ఇప్పుడు అర్ష్‌దీప్ 70 పరుగులకు నాలుగు వికెట్లు తీసి ఈ జాబితాలో మూడో భారత ఫాస్ట్ బౌలర్‌గా చేరాడు. అయితే అతడి గణాంకాలు ఈ ముగ్గురిలో అత్యుత్తమం కావు. న్యూజిలాండ్ గడ్డపై భారత పేసర్ల నాలుగు వికెట్ల ప్రదర్శనల్లో అర్ష్‌దీప్ బౌలింగ్ గణాంకాలు నాలుగో అత్యుత్తమంగా నమోదయ్యాయి.

విల్ యంగ్ నుంచి జేమీసన్ వరకు..

ఆక్లాండ్ వన్డేలో అర్ష్‌దీప్ కీలక సమయంలో వికెట్లు తీశాడు. తొలుత విల్ యంగ్‌ను 9 పరుగుల వద్ద, హెన్రీ నికోల్స్‌ను కూడా 9 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులు చేసిన సమయంలో అతడి వికెట్ తీశాడు. చివర్లో కైల్ జేమీసన్‌ను ఒక పరుగు వద్ద ఔట్ చేశాడు. అయితే ఈ స్పెల్‌లో అతడు 70 పరుగులు ఇవ్వడంతో భారత బౌలర్లలో అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు అన్‌శుల్ కాంబోజ్ 22 పరుగులకే రెండు వికెట్లు, గుర్నూర్ బ్రార్ 44 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టారు.

భారత బౌలర్ల దెబ్బకు 185 పరుగులకే కివీస్ ఆలౌట్

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో లేకపోయినా భారత యువ బౌలర్లు సత్తా చాటారు. అర్ష్‌దీప్, గుర్నూర్, కాంబోజ్ కీలక వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సీఫర్ట్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో బ్లెయిర్ టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. అర్ష్‌దీప్ మరో వికెట్ తీసి ఉంటే న్యూజిలాండ్ గడ్డపై ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలోనూ చేరేవాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us