Aman Rao : అమెరికాలో పుట్టి..చివరి బంతికి సిక్సర్ బాది మరీ 200..ఎవరీ అమన్ రావు?

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అమన్ రావు విద్వంసం సృష్టించాడు. టాస్ గెలిచిన బెంగాల్ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ ఓపెనర్లు రాహుల్ సింగ్ (65), అమన్ రావు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అమన్ మొదట నిలకడగా ఆడి 108 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు.

Aman Rao : అమెరికాలో పుట్టి..చివరి బంతికి సిక్సర్ బాది మరీ 200..ఎవరీ అమన్ రావు?
Aman Rao Double Century

Updated on: Jan 06, 2026 | 7:34 PM

Aman Rao : విజయ్ హజారే ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ కుర్రాడు, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది తన డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇంతకీ ఎవరీ అమన్ రావు? అమెరికాలో పుట్టి భారత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ కుర్రాడి కథేంటో చూద్దాం.

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అమన్ రావు విద్వంసం సృష్టించాడు. టాస్ గెలిచిన బెంగాల్ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ ఓపెనర్లు రాహుల్ సింగ్ (65), అమన్ రావు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అమన్ మొదట నిలకడగా ఆడి 108 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. అయితే, వంద పరుగులు దాటాక అమన్ విశ్వరూపం చూపించాడు. తర్వాతి 100 పరుగులను కేవలం 46 బంతుల్లోనే బాదేశాడు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో, చివరి బంతికి ముందు అమన్ 194 పరుగుల వద్ద ఉన్నాడు. ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపి అద్భుతమైన రీతిలో తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 154 బంతుల్లో 200 పరుగులు చేసిన అమన్ ఇన్నింగ్స్‌లో 13 భారీ సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి.

అమన్ రావు నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను జూన్ 2, 2004న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మాడిసన్ నగరంలో జన్మించాడు. పుట్టింది అమెరికాలోనే అయినా, తన క్రికెట్ కలను నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. కేవలం 3 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లోనే 252 పరుగులు, 11 టీ20ల్లో 301 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు.

అమన్ రావు టాలెంటును ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పుడే గుర్తించాయి. ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. వేలంలో తక్కువ ధరకే దొరికిన ఈ వజ్రాన్ని రాజస్థాన్ ఎలా వాడుకుంటుందో చూడాలి. ప్రస్తుత విజయ్ హజారే ఫామ్‌ను చూస్తుంటే ఐపీఎల్‌లో కూడా అమన్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడుతున్న అమన్, భవిష్యత్తులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..