Vaibhav Sooryavanshi : వైభవ్‎కి ఇప్పుడే ఛాన్స్ ఇస్తే అన్యాయం జరిగినట్లే.. ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టు ఇదే

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్‌తో తొలి టీ20కు ముందు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫామ్‌లో ఉన్న సీనియర్లను తప్పించి ఇప్పుడు అవకాశం ఇవ్వడం అన్యాయమని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. తన తుది భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించారు.

Vaibhav Sooryavanshi : వైభవ్‎కి ఇప్పుడే ఛాన్స్ ఇస్తే అన్యాయం జరిగినట్లే.. ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టు ఇదే
Vaibhav Sooryavanshi

Updated on: Jun 26, 2026 | 12:18 PM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ అభిమానులు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ బరిలో చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ పడినప్పుడు, అందరి చూపు భారత తుది జట్టుపైనే ఉండనుంది. ఐపీఎల్‌లో పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా భారత్ తరఫున ఆడబోయే తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసిన వీడియోలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. “ప్రస్తుతం అందరి మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న వైభవ్ సూర్యవంశీ ఈరోజు అరంగేట్రం చేయాలా? అని. ఒకవేళ మీరు అతనికి ఈ మ్యాచ్ లో అవకాశం ఇస్తే, అది ఫామ్‌లో ఉన్న ఇతర ప్లేయర్లకు అన్యాయం చేసినట్లు అవుతుంది. అలా కాకుండా జట్టులో ఉన్న ఆటగాళ్లకు న్యాయం చేయాలని చూస్తే, వైభవ్‌కు ఇప్పుడే డెబ్యూ ఛాన్స్ ఇవ్వలేరు” అని విశ్లేషించారు. టాప్ ఆర్డర్‌లో విపరీతమైన పోటీ ఉండటమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు.

భారత జట్టు చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడింది వరల్డ్ కప్ ఫైనల్లో అని, ఆ మ్యాచ్ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిందని ఆకాష్ చోప్రా గుర్తు చేశారు. ఆ తర్వాత విరామం దొరకడం, ఇదే సమయంలో ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయన్నారు. అయితే, ప్రస్తుతం భారత జట్టు టాప్-3 స్థానాల్లో సంజూ శాంసన్, ఈషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు వైభవ్‌ను జట్టులోకి తీసుకురావాలంటే వీరిలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుందని, అది ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మ్యాచ్ జరగబోయే బెల్ఫాస్ట్ మైదానంలోని పిచ్ బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారనుందని, ఇక్కడి వాతావరణం, పిచ్ కండిషన్స్ బౌలర్లకు బాగా సహకరిస్తాయని ఆకాష్ చోప్రా పేర్కొన్నారు. ఐర్లాండ్ జట్టు భారత్‌కు అంత పెద్ద సవాల్ విసరకపోవచ్చు కాబట్టి, కొత్త ప్రయోగాల కోసం వైభవ్‌ను బరిలోకి దించవచ్చనే వాదన కూడా ఉంది. కానీ, న్యాయబద్ధంగా చూస్తే మాత్రం సీనియర్లను డ్రాప్ చేయడం కరెక్ట్ కాదనేది ఆయన గట్టి నమ్మకం. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా పొంచి ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.

ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టు

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఈషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us