Vaibhav Suryavanshi : రెచ్చగొట్టిన పాక్ బౌలర్‌పై బ్యాట్ ఝళిపించిన వైభవ్ సూర్యవంశీ..ఇది రివెంజ్ అంటే!

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏ జట్టు చేతిలో భారత్ ఏ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏ టీమ్ కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం మెరుపు ఆరంభాన్ని అందించాడు.

Vaibhav Suryavanshi : రెచ్చగొట్టిన పాక్ బౌలర్‌పై బ్యాట్ ఝళిపించిన  వైభవ్ సూర్యవంశీ..ఇది రివెంజ్ అంటే!
Vaibhav Suryavanshi

Updated on: Nov 17, 2025 | 3:17 PM

Vaibhav Suryavanshi : ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏ జట్టు చేతిలో భారత్ ఏ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏ టీమ్ కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం మెరుపు ఆరంభాన్ని అందించాడు. అతను 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్‌తో గొడవ పడ్డాడు. బౌలర్ స్లెడ్జింగ్ చేయబోగా, దానికి బదులుగా సూర్యవంశీ బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు.

పాకిస్తాన్ ఏ జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన ఉబైద్ షా, వైభవ్ సూర్యవంశీ మధ్య ఈ ఘటన జరిగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతిని ఉబైద్ షా వేయగా, వైభవ్ గ్యాప్ చూసి ఫోర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. దీంతో ఉబైద్ షా.. వైభవ్‌ను ఏదో ఒకటి అని చిలిపిగా ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు.

దీనికి వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం తగ్గలేదు. బాల్ డాల్ న (బాల్ వెయ్) అని పాక్ బౌలర్‌కు గట్టిగా బదులిచ్చాడు. పదే పదే అదే మాట అనడంతో, పాకిస్తాన్ బౌలర్ ఉబైద్ షా మరేమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత బౌలర్ ఉబైద్ షా వేసిన తర్వాతి బంతిని కూడా వైభవ్ అదే ఫీల్డర్ మీదుగా దబదబా బౌండరీకి పంపించి, తన కోపానికి బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.

వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 160.71 స్ట్రైక్ రేట్‌తో 45 పరుగులు చేయగా, నమన్ ధీర్ 20 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు. అయితే ఈ ఇద్దరిని మినహాయిస్తే, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ప్రియాంశ్ ఆర్య (10), కెప్టెన్ జితేష్ శర్మ (5), నెహాల్ వధేరా (8) త్వరగా పెవిలియన్ చేరారు. ఆశుతోష్ శర్మ అయితే ఖాతా కూడా తెరవలేకపోయాడు. దీంతో భారత్ ఏ జట్టు 136 పరుగులకే ఆలౌట్ అయింది.

137 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 13.2 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. పాకిస్తాన్ ఓపెనర్ మాజ్ సదాకత్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో నాటౌట్ 79 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. భారత బౌలర్లలో ఎవరూ కూడా ప్రభావం చూపలేకపోయారు. గుర్జపనీత్ సింగ్ 3 ఓవర్లలో 28 పరుగులు ఇవ్వగా, యష్ ఠాకూర్ 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు. నమన్ ధీర్ వేసిన 8 బంతుల్లోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..