Abhishek Sharma : హరారేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్

Abhishek Sharma : జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ బౌలింగ్‌లో మెరిసి 3 వికెట్లు తీశాడు. టీ20ల్లో ఓపెనర్‌గా ఒకే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించి, వీరేంద్ర సెహ్వాగ్ 14 ఏళ్ల నాటి రికార్డును సమం చేశాడు.

Abhishek Sharma : హరారేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
Abhishek Sharma

Updated on: Jul 26, 2026 | 11:13 AM

Abhishek Sharma : జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన రెండో టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో సంచలనం సృష్టించాడు. బ్యాటింగ్‌లో కేవలం 8 బంతుల్లో 8 పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం ఊహించని రీతిలో అదరగొట్టాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతిని అభిషేక్‌కు అందించగా, తన స్పిన్ మ్యాజిక్‌తో జింబాబ్వే బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అత్యంత విజవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

3 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఓపెనర్

అభిషేక్ శర్మ కేవలం 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లను నేలకూల్చాడు. జింబాబ్వే ప్లేయర్లు బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ నమహురి, రిచర్డ్ నగారవాలను వరుసగా పెవిలియన్ చేర్చాడు. టి20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో అభిషేక్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అంతేకాకుండా టి20 ఇంటర్నేషనల్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒకే మ్యాచ్‌లో 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.

14 ఏళ్ల తర్వాత సెహ్వాగ్ రికార్డు సమం

ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు కలిపి) ఒకే మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 3 వికెట్లు తీసిన రెండో భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. అంతకుముందు టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. సెహ్వాగ్ సరిగ్గా 14 ఏళ్ల క్రితం, అంటే 26 ఫిబ్రవరి 2012న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి 43 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు అభిషేక్ శర్మ ఒక ఓపెనర్‌గా అంతర్జాతీయ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సెహ్వాగ్ అరుదైన రికార్డును రీసెంట్ మ్యాచ్‌లో రిపీట్ చేశాడు.

భారత్‌కు భారీ విజయం

వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 3 వికెట్లు తీసినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. కానీ అభిషేక్ శర్మ చేసిన ఈ బౌలింగ్ ప్రదర్శన టీమిండియా విజయానికి ఎంతగానో దోహదపడింది. అభిషేక్ దెబ్బకు జింబాబ్వే కోలుకోలేకపోయింది. ఈ రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేను ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఓడించి, సిరీస్‌లో శుభారంభం చేయడంతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మొదటి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us