
Mahesh Tambe : క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోయే విధంగా ఫిన్‌లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన బౌలర్ మహేష్ తాంబే అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. ఎస్టోనియా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. దీంతో టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన బౌలర్‌గా మహేష్ తాంబే ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి ఆయన కేవలం 2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గతంలో ఈ రికార్డు బహ్రెయిన్‌కు చెందిన జునైద్ అజీజ్ పేరిట ఉండేది. ఆయన 2022లో జర్మనీపై 10 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టారు. కానీ, మహేష్ తాంబే అంతకంటే తక్కువ బంతుల్లోనే ఈ రికార్డు పూర్తి చేశాడు.
ఆదివారం జరిగిన ఫిన్‌లాండ్ వర్సెస్ ఎస్టోనియా మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్టోనియా 19.4 ఓవర్లలో 141 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఎస్టోనియా 14.3 ఓవర్లలో 104 పరుగులు చేసి, 8 వికెట్లు చేతిలో ఉండటంతో మంచి స్థితిలో ఉంది. కానీ మసూద్ మూడో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత వికెట్లు వరుసగా పడిపోయాయి. మహేష్ తాంబేతో పాటు జునైద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, అమ్జాద్ షేర్, అఖిల్ అర్జునం, మాధవ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తాంబే కేవలం 8 బంతుల్లోనే 5 వికెట్ల ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. అతను 5 వికెట్లు పడగొట్టిన బ్యాట్స్‌మెన్‌లు – స్టెఫెన్ గోచ్, సాహిల్ చౌహాన్, ముహమ్మద్ ఉస్మాన్, రూపమ్ బారువా, ప్రణయ్ గీవాలా. ఫిన్‌లాండ్ జట్టు 142 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో ఛేదించి విజయం సాధించింది. అరవింద్ మోహన్ 60 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్లతో అజేయంగా 67 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇది నిర్ణయాత్మక మ్యాచ్. ఈ విజయం ఫిన్‌లాండ్‌కు 2-1 తేడాతో సిరీస్‌ను అందించింది.
39 ఏళ్ల మహేష్ తాంబే 2021లో ఫిన్‌లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు అతను 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాంబే తన టీ20 కెరీర్‌లో మొదటిసారిగా 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అది కూడా ప్రపంచ రికార్డు సృష్టిస్తూ కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో మహేష్ తాంబే క్రికెట్ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..