
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమవుతుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఒమన్, హాంకాంగ్, ఆతిథ్య యూఏఈ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈసారి ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. మైదానంలో 11 మంది ఆటగాళ్లు మాత్రమే ఆడుతారు. అయితే, డగౌట్‌లో కూర్చున్న చాలా మంది ఆటగాళ్లకు మొత్తం టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాదు. ఈసారి కూడా అలాంటి ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు.
నురుల్ హసన్ – బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జట్టులో సీనియర్ వికెట్ కీపర్ నురుల్ హసన్‌ను చేర్చినా, కెప్టెన్ లిటన్ దాస్ ఇప్పటికే వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అందుకే, నురుల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం చాలా కష్టం. అతను 2022 తర్వాత బంగ్లాదేశ్ తరఫున కేవలం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అతని చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో జరిగింది.
హసన్ అలీ – పాకిస్థాన్
పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ జట్టులోకి తిరిగి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని టీ20 రికార్డు అంతగా బాగాలేదు. ముఖ్యంగా అతని ఎకానమీ 9 పరుగుల కంటే ఎక్కువగా ఉంది. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రౌఫ్ వంటి అద్భుతమైన బౌలర్లు జట్టులో ఉండటం వల్ల అతనిని ఆడించే అవకాశాలు చాలా తక్కువ.
హర్షిత్ రాణా – భారత్
భారత జట్టులో పేసర్లకు కొదవలేదు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే ప్రధాన బౌలర్లు. హార్దిక్ పాండ్యా, శివం దూబే కూడా ఎక్స్ ట్రా బౌలింగ్ చేస్తారు. అందుకే, యువ ఆటగాడు హర్షిత్ రాణాకు అవకాశం రావడం దాదాపు అసాధ్యం. అతను ఇప్పటివరకు కేవలం ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే ఆడాడు. అది కూడా సబ్‌స్టిట్యూట్‌గా.
దర్వేష్ రసూలీ – అఫ్గానిస్తాన్
అఫ్గానిస్తాన్ బ్యాటర్ దర్వేష్ రసూలీ అంతర్జాతీయ టీ20లో ఇప్పటివరకు తన ముద్ర వేయలేకపోయాడు. అతను 12 మ్యాచ్‌లలో కేవలం 149 పరుగులు మాత్రమే చేశాడు. అతని యావరేజ్ (15), స్ట్రైక్ రేట్ (112) రెండూ నిరాశపరిచాయి. అందుకే, టీమ్ మేనేజ్‌మెంట్ అతనిని ఆడించడానికి ఆసక్తి చూపకపోవచ్చు.
చమికా కరుణారత్నే – శ్రీలంక
శ్రీలంక ఆల్ రౌండర్ చమికా కరుణారత్నే ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతను గత రెండు సంవత్సరాలలో కేవలం రెండు టీ20లు మాత్రమే ఆడి, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. జట్టులో అతని కంటే మెరుగైన బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండటంతో అతను ఆడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..