IND vs NZ : రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు గల్లంతు

IND vs NZ : న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఊదేశింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బ్యాట్‌లతో విరుచుకుపడటంతో మైదానంలో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాటు ఏకంగా ఐదు భారీ రికార్డులు బద్దలయ్యాయి.

IND vs NZ : రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు గల్లంతు
Ind Vs Nz 2nd T20i

Updated on: Jan 24, 2026 | 12:08 PM

IND vs NZ : రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఊదేశింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బ్యాట్‌లతో విరుచుకుపడటంతో మైదానంలో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాటు ఏకంగా ఐదు భారీ రికార్డులు బద్దలయ్యాయి. కివీస్ బౌలర్లు చుక్కలు చూడగా, భారత బ్యాటర్లు చరిత్ర తిరగరాశారు.

1. న్యూజిలాండ్‌పై వేగవంతమైన హాఫ్ సెంచరీ

భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో ఊచకోత కోశాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో న్యూజిలాండ్‌పై అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. సరిగ్గా 48 గంటల క్రితమే అభిషేక్ శర్మ (22 బంతుల్లో 50) నెలకొల్పిన రికార్డును ఇషాన్ చెరిపేయడం విశేషం.

2. పవర్ ప్లేలో నాన్-ఓపెనర్ సరికొత్త చరిత్ర

సాధారణంగా పవర్ ప్లేలో ఓపెనర్లు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధిస్తుంటారు. కానీ ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ త్వరగా అవుట్ కావడంతో వన్ డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్, పవర్ ప్లే ముగిసేలోపే తన యాభై పరుగులు పూర్తి చేశాడు. తద్వారా పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ బాదిన తొలి నాన్ ఓపెనర్ భారత బ్యాటర్‌గా ఇషాన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

3. 200+ రన్ ఛేజ్‌లో వరల్డ్ రికార్డ్

టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో (ఫుల్ మెంబర్ జట్ల మధ్య) 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. 209 పరుగుల లక్ష్యాన్ని 28 బంతులు మిగిలి ఉండగానే టీమ్ ఇండియా పూర్తి చేసింది. గతంలో పాకిస్థాన్ (24 బంతులు మిగిలి ఉండగా 205 రన్స్ ఛేజ్) పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

4. కివీస్ బౌలర్ జాక్ ఫౌల్క్స్ అవాంఛనీయ రికార్డు

న్యూజిలాండ్ బౌలర్ జాక్ ఫౌల్క్స్ కు ఈ మ్యాచ్ ఒక పీడకల. కేవలం 3 ఓవర్లలోనే 67 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక కివీస్ బౌలర్ ఒకే మ్యాచ్‌లో ఇన్ని పరుగులు ఇవ్వడం ఇదే మొదటిసారి. 2018లో బెన్ వీలర్ (64 పరుగులు) పేరిట ఉన్న చెత్త రికార్డును ఫౌల్క్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

5. మొదటి ఓవర్‌లోనే అర్షదీప్ చెత్త రికార్డు

భారత పేసర్ అర్షదీప్ సింగ్ కూడా ఒక అవాంఛనీయ రికార్డును మూటగట్టుకున్నాడు. మ్యాచ్‌లోని తొలి ఓవర్‌లోనే 18 పరుగులు ఇచ్చి, టీ20ల్లో మొదటి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు. గతంలో 2022లో ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ భారత బౌలర్‌పై 18 పరుగులు రాబట్టగా, ఇప్పుడు అర్షదీప్ ఆ రికార్డును సమం చేశాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..