Viral Video: హాకీ మధ్యలో కుస్తీ .. గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఆటగాళ్లు.. జెర్సీ లాగుతూ.. గొంతులు పట్టుకుంటూ..

| Edited By: Team Veegam

Aug 05, 2022 | 12:30 PM

Commonwealth Games 2022: హాకీ మ్యాచ్‌ మధ్యలోనే కుస్తీ పోటీలు జరిగాయి. అది కూడా ప్రొఫెషనల్ రెజ్లర్ల లాగా ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. గొంతు, జెర్సీలు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లారు. పురుషుల హాకీ మ్యాచ్‌లో భాగంగా ..

Viral Video: హాకీ మధ్యలో కుస్తీ .. గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఆటగాళ్లు.. జెర్సీ లాగుతూ.. గొంతులు పట్టుకుంటూ..
Cwg 2022 Hockey
Follow us on

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే గేమ్స్‌ ప్రారంభమై వారం రోజులు పూర్తయ్యాయి. పలు ఈవెంట్‌లు తుది దశకు చేరుకున్నాయి. హాకీ పోటీలు కూడా సెమీస్‌ దాకా వచ్చాయి. ఇంకా రెజ్లింగ్‌ (కుస్తీపోటీలు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇక్కడ హాకీ మ్యాచ్‌ మధ్యలోనే కుస్తీ పోటీలు జరిగాయి. అది కూడా ప్రొఫెషనల్ రెజ్లర్ల లాగా ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. గొంతు, జెర్సీలు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లారు. పురుషుల హాకీ మ్యాచ్‌లో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లండ్‌- కెనడా జట్ల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా కెనడా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించగా, సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్ స్థానం ఖాయమైంది. అయినా ఇంగ్లిష్‌ జట్టు దూకుడుగాఆడింది. రెండవ క్వార్టర్ ముగిసే సమయానికి కెనడాపై 4-1 ఆధిక్యం సాధించింది. అయితే ఇదే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

కాగా మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫార్వార్డ్ నిరంతరం కెనడా గోల్‌ పోస్ట్‌పై దాడులు చేశాడు. మరోవైపు కెనడియన్ డిఫెండర్ వాటిని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రిఫిత్స్, కెనడాకు చెందిన బాల్‌రాజ్ పనేసర్ ముఖాముఖిగా తలపడ్డారు. గ్రిఫిత్స్ బంతిని అందుకోవడానికి ప్రయత్నించగా, పనేసర్ అతనిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే హాకీ స్టిక్‌ గ్రిఫిత్స్ పొట్ట దగ్గరికి వచ్చింది. దీంతో ఇంగ్లిష్ ఆటగాడు కోపోద్రిక్తుడయ్యాడు. ప్రత్యర్థి ఆటగాడి జెర్సీని పట్టుకుని అతని మెడను దగ్గరకు లాగాడు. పనేసర్‌ కూడా కోపంగా చూస్తూ గ్రిఫిత్స్ గొంతును పట్టుకున్నాడు. ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. ఇంతలోనే ఇరు జట్ల ఆటగాళ్లు వారిని విడిపించడానికి ప్రయత్నించారు. కాగా మ్యాచ్‌ మధ్యలోనే గొడవకు దిగిన ఆటగాళ్లపై రెఫరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనేసర్‌కు రెడ్ కార్డ్ చూపించి మ్యాచ్ నుంచి బయటకు పంపాడు. గ్రిఫిత్స్‌కు కూడా ఎల్లో కార్డు కూడా చూపించాడు. కాగా గ్రిఫిత్స్ మొదట జెర్సీని పట్టుకున్నప్పటికీ, పనేసర్ ఏకంగా గొంతు పట్టుకున్నాడు. అందుకే అతనికి రెడ్‌కార్డ్‌ చూపించి బయటకు పంపించారు రెఫరీ. కాగా ఈ గొడవతో కెనడా అన్ని విధాలా నష్టపోయింది. అప్పటికే 1-4తో వెనుకబడిన జట్టు చివరికి 2-11తో దారుణంగా ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..