
Anmish Varma Bhupathiraju: భారత సాహస యాత్రికుడు, విశాఖపట్నానికి చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు ఖండాలలోని ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలను (Seven Volcanic Summits) అతి తక్కువ కాలంలో అధిరోహించిన ‘ఫాస్టెస్ట్ మేల్’గా ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందారు. మార్చి 17 రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని వినయ్ మార్గ్ లో ఉన్న CSOI వేదికగా జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిధి రిషి నాథ్ చేతుల మీదుగా అన్మిష్ ఈ అధికారిక సర్టిఫికేట్‌ను అందుకున్నారు.
అన్మిష్ వర్మ ప్రయాణం కేవలం అగ్నిపర్వతాలకే పరిమితం కాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడమే కాకుండా, ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలను (Seven Summits) కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా, మంచుతో గడ్డకట్టిన అంటార్కిటికా ఖండంలోని దక్షిణ ధృవానికి (South Pole) స్కీయింగ్ చేస్తూ చేరుకుని తన పట్టుదలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒక మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ నుంచి అంతర్జాతీయ పర్వతారోహకుడిగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.
విశాఖ తీర నగరం నుంచి వచ్చి గ్లోబల్ లెవల్‌లో రికార్డులు సృష్టించడం అన్మిష్ వర్మ అంకితభావానికి నిదర్శనం. పట్టుదల, అభిరుచి ఉంటే ఏ శిఖరమైనా అధిరోహించవచ్చు అని ఆయన నిరూపించారు. ఈ గిన్నిస్ విజయం కేవలం అన్మిష్ వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు, ఇది యావత్ భారతదేశ విజయం. ఎంతో మంది యువతకు తన విజయగాథ ద్వారా ఆయన దిక్సూచిగా నిలుస్తున్నారు.
అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించడం అనేది అత్యంత ప్రమాదకరమైన పని. ప్రతికూల వాతావరణం, ఆక్సిజన్ కొరత వంటి సవాళ్లను అధిగమిస్తూ ఆయన ఈ ఘనత సాధించారు. దేశం గర్వించేలా గ్లోబల్ మ్యాప్‌లో భారత్ పేరును నిలబెట్టిన అన్మిష్ వర్మపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..