
దేవుళ్లందరిలో భోళాశంకరుడికి భక్త సులభుడు అనే పేరుంది. ఎందుకంటే.. గంగాజలంతో అభిషేకం చేసి, భక్తితో ఒక బిల్వ పత్రం సమర్పించినా చాలు అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శివపూజలో అభిషేకానికి ఎంత ప్రాధాన్యత ఉందో, బిల్వ పత్ర పూజకు కూడా అంతే మహత్యం ఉంది. బిల్వ పత్రాల గొప్పతనాన్ని చాటేందుకు ఏకంగా బిల్వాష్టకం రచించారంటే, శివునికి బిల్వ దళాలపై ఉన్న అపారమైన ప్రీతిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సృష్టిలో అనేక రకాల ఆకులు ఉన్నప్పటికీ.. శివుడికి బిల్వ పత్రాలంటేనే ఎందుకు ప్రత్యేక ఇష్టం? దానికి సమాధానం ఈ శివమహాపురాణ గాథలో దాగి ఉంది. ఇప్పుడు ఆ రహస్యం గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపం. అందుకే శివలింగార్చనలో బిల్వ పత్రాలతో పూజ చేయడం అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. ఈ నమ్మకానికి కారణమైన సంఘటన శనిదేవునితో సంబంధం కలిగి ఉంది.
ఒక సందర్భంలో శనిదేవుడు కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు, శని ధర్మనిష్ఠను పరీక్షించాలనుకుని.. “లోకాలను పీడించే నువ్వు నన్ను కూడా పట్టగలవా?” అని ప్రశ్నించాడు.
శనిదేవుడు వినయంగా, “తమ అనుగ్రహం ఉంటే నాకు అసాధ్యమేమీ లేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మిమ్మల్ని పట్టి ఉండగలను” అని సమాధానం ఇచ్చాడు.
శని విధి నిర్వహణను పరీక్షించేందుకు శివుడు మరుసటి రోజు బిల్వ వృక్ష రూపాన్ని దాల్చి, అందులో అదృశ్యంగా నివసించాడు. శివుడు కనిపించకపోవడంతో పార్వతీ దేవి, దేవతలంతా ముల్లోకాలను గాలించారు. అదే సమయంలో శనిదేవుడూ ఎక్కడా కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
రోజంతా గడిచిన తర్వాత సంధ్యా సమయంలో శివుడు బిల్వ వృక్షం నుంచి సాకార రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షణమే శనిదేవుడు కూడా అదే వృక్షం నుంచి బయటకు వచ్చాడు.
శివుడు శనిని ఉద్దేశించి.. “నన్ను పట్టలేకపోయావు కదా!” అని అన్నాడు. దానికి శనిదేవుడు వినయంగా, “ప్రభూ! నేను మిమ్మల్ని పట్టడం వల్లనే మీరు ఈ బిల్వ వృక్షాన్ని ఆశ్రయించారు. ఇదంతా నా శక్తి కాదు, మీ లీల మహిమే” అని నమస్కరించాడు.
శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన పరమేశ్వరుడు ఆయనకు వరం ఇచ్చాడు.
“నీవు ఇకపై శనీశ్వరుడిగా ప్రసిద్ధి పొందుతావు. శని దోషం ఉన్నవారు నన్ను బిల్వ పత్రాలతో పూజిస్తే వారికి దోష నివృత్తి కలుగుతుంది. శివ భక్తులను శనీశ్వరుడు ఎన్నటికీ బాధించడు” అని ప్రకటించాడు. అప్పటి నుంచే బిల్వ వృక్షాన్ని శివ స్వరూపంగా భావించి, శివునికి బిల్వ పత్రాలతో అర్చించడం ఆచారంగా మారింది.
జాతకరీత్యా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు శివుని బిల్వ పత్రాలతో పూజిస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏక బిల్వం శివార్పణం త్రిజన్మ పాపసంహారకరం అని భక్తుల విశ్వాసం. ఇది స్వయంగా పరమేశ్వరుడు ఇచ్చిన వరం. ప్రతీ సోమవారం లేదా మహా శివరాత్రి వంటి పవిత్ర సందర్భాలలో శివునికి బిల్వ పత్రాలతో పూజ చేసి, ఆయన అనుగ్రహంతో శని దోషాలు, పాపాలు తొలగించుకోవచ్చు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)