
Seeing dead person in dream: మనం నిద్రిస్తున్న సమయంలో తరచూ అనేక కలలు వస్తుంటాయి. అయితే, కొన్ని కలలు మాత్రం మన ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయి. కొన్ని మాత్రం మనకు సంబంధం లేనివి కూడా కలలో దర్శనిమిస్తుంటాయి. కలలు కొన్ని సంకేతాలు కూడా ఇస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అందుకే మనకు నిద్రలో వచ్చే కలలు కేవలం ఊహలు మాత్రమే కావు అని అంటారు. కొన్ని సందర్భాల్లో అవి మన మనసులో దాగి ఉన్న భావాలు, భయాలు, జ్ఞాపకాలు లేదా భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను కూడా సూచిస్తాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా కలలో మరణించిన వ్యక్తిని చూడడం చాలా మందిని కలవరపెడుతుంది. అయితే దీనికి భయపడాల్సిన అవసరం ఉందా? లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేక అర్థం దాగి ఉందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మరణించిన వ్యక్తి మీకు చాలా దగ్గరైన వారైతే, వారి జ్ఞాపకాలు ఇంకా మీ మనసులో బలంగా ఉండటం వల్ల ఈ తరహా కలలు రావచ్చు. ఇది మీ మనసు వారిని ఇంకా మర్చిపోలేకపోతున్నదనే సంకేతం.
ఆ వ్యక్తితో చెప్పలేకపోయిన మాటలు, చేయలేకపోయిన పనులు లేదా మిగిలిపోయిన భావాలు కల రూపంలో బయటపడతాయి. ఇది మీ అంతరాత్మ శాంతి కోసం మీ మనసు కోరుకుంటున్న సూచన కావచ్చు.
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో మరణం లేదా శవాన్ని చూడడం అనేది నిజ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. పాత ఆలోచనలు ముగిసి, కొత్త దశ ప్రారంభమయ్యే సూచనగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో మృతుడు కలలో ఏదైనా చెప్పడం లేదా సూచించడం కనిపిస్తే.. అది మన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై హెచ్చరికగా భావిస్తారు. ముఖ్యంగా ఆ కల స్పష్టంగా గుర్తుండిపోయినప్పుడు దానికి ప్రాధాన్యం ఉంటుంది.
ప్రస్తుతం మీరు మానసిక ఒత్తిడి, భయం లేదా అస్థిరతలో ఉన్నప్పుడు కూడా ఈ రకమైన కలలు రావచ్చు. ఇది మీ మనసు ఎదుర్కొంటున్న ఆందోళనకు ప్రతిరూపం.
కలలో మృతుడిని చూడడం తప్పనిసరిగా చెడు సూచన కాదని నిపుణులు అంటున్నారు. చాలా సందర్భాల్లో ఇది మనసులోని భావోద్వేగాల ప్రతిఫలనం మాత్రమే. అయితే కలలు తరచుగా వస్తూ, మానసిక అసౌకర్యం కలిగిస్తే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కలలను పూర్తిగా భవిష్యత్తుతో అనుసంధానించకుండా.. వాటిని మన మానసిక స్థితిని అర్థం చేసుకునే ఒక సంకేతంగా చూడటం ఉత్తమం.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం కొంత స్వప్న శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)