
హిందూ సంప్రదాయంలో ముగ్గులకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా వేసే ముగ్గులకు, పండగలకు వేసే ముగ్గులకు తేడాలుంటాయి. అయితే, వేసే ముగ్గు మాత్రం బియ్యం పిండితో మాత్రమే వేస్తారు. ఇప్పుడు కొన్ని రంగులు కూడా వాడుతున్నారు. మన పూర్వకాలం నుంచి బియ్యం పిండిని మాత్రమే ముగ్గులు వేసేందుకు ఉపయోగించేవారు. ఇందులో సంప్రదాయం, శాస్త్రీయతతోపాటు మానవీయ కోణం కూడా ఉంది.
తెలుగు ఇంటి ముంగిట్లో ఉదయం పడే ముగ్గు కేవలం అలంకారం కాదు.. అది మన సంస్కృతి, శుభ సూచకం, ప్రకృతి పట్ల మన గౌరవానికి ప్రతీక. ముఖ్యంగా ముగ్గులు ఎక్కువగా బియ్యం పిండితో వేస్తారు. మరి దీనికి కారణం ఏమిటి? శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా, సంప్రదాయపరంగా దీని వెనుక ఉన్న అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం భారతీయ ఆహార సంస్కృతిలో ప్రధానమైన ధాన్యం. ఇది ఆహారం, సమృద్ధి, జీవనాధారంకి చిహ్నం. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయడం అంటే — “ఈ ఇంట్లో అన్నపూర్ణా దేవి నివసించుగాక” అన్న భావన.
పూర్వ కాలం నుంచి ముగ్గులను బియ్యం పిండితోనే వేసే సంప్రదాయం వస్తోంది. ఎందుకంటే.. చిన్న చిన్న పక్షులు, చీమలు, చిన్న జీవులు.. ముగ్గులో వేసిన బియ్యం పిండిని తిని జీవించేవి. ఇది అహింస, కరుణ, జీవహిత భావనను తెలియజేస్తుంది. అంటే, మన పూర్వీకులు ఉదయాన్నే ప్రకృతికి మొదటి ఆహారం సమర్పించేవారు అని తెలియజేస్తోంది.
బియ్యం పిండి సహజంగా నేలను చల్లగా ఉంచుతుంది. తేమను నియంత్రిస్తుంది. ఇంటి ముందు సూక్ష్మక్రిములు తగ్గేలా చేస్తుంది. అందుకే ఉదయం సూర్యోదయానికి ముందు ముగ్గులు వేయాలని సంప్రదాయం.
హిందూ సంప్రదాయం ప్రకారం.. ముగ్గు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. తెల్లని బియ్యం పిండి శుద్ధత, శాంతి, సాత్వికతకు సూచిక. ముఖ్యంగా శుక్రవారం, అమావాస్య, పండుగ రోజుల్లో ముగ్గులు వేయడం చాలా శుభం. ముగ్గు వేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఉదయాన్నే సృజనాత్మకత మొదలవుతుంది. ఇది ధ్యానం లాంటిదే.
ఆరోగ్యపరమైన కోణం
బియ్యం పిండి రసాయనాలు లేని సహజ పదార్థం. అలర్జీలు కలిగించదు. పిల్లలు, పెద్దలు అందరూ సురక్షితంగా వాడవచ్చు. ఈ రోజుల్లో రంగులు వాడినా, సంప్రదాయంగా బియ్యం పిండే ఉత్తమం.
ముగ్గులు వేసే అలవాటు వల్ల మహిళల్లో కళాత్మకత పెరుగుతుంది. పిల్లలకు సంస్కృతి పరిచయం అవుతుంది. ఇంటింటా ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ది తరతరాలకు వారసత్వంగా వచ్చిన సంప్రదాయం.
బియ్యం పిండితో ముగ్గులు వేయడం అంటే ప్రకృతికి ఆహారం, దేవతలకు ఆహ్వానం, మనసుకు ప్రశాంతత, ఇంటికి శుభశక్తిని తీసుకురావడం. అందుకే మన పూర్వీకులు ఈ చిన్న పనిలో కూడా గొప్ప అర్థాన్ని నింపారు. నేటి ఆధునిక జీవితంలోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తే.. మన ఇంట్లోనూ, మన మనసుల్లోనూ శుభత పెరుగుతుంది.