భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ఏమవుతుంది.. ఇవి తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే..
ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాదు మన ప్రాణ శక్తికి మూలాధారం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనం భోజనం చేసే పద్ధతి మన జీవితంలోని సుఖశాంతులను శాసిస్తుందని మీకు తెలుసా..? ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో భోజనం చేస్తే ఏమవుతుంది..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..? అనేది తెలుసుకుందాం..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. మనం తినే ఆహారం మన ఆలోచనలను, మన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే పూర్వ కాలం నుండి భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించేవారు. అయితే నేటి ఆధునిక కాలంలో చాలా మంది తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి.
ఒకే ప్లేట్‌లో భోజనం.. ఎందుకు వద్దు?
చాలా మంది భార్యాభర్తలు ప్రేమకు చిహ్నంగా ఒకే ప్లేట్‌లో భోజనం చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం కాదు. కుటుంబ పెద్దకు భార్యతో పాటు ఇంట్లోని ఇతర సభ్యుల బాధ్యతలు కూడా ఉంటాయి. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల కుటుంబ పెద్ద తన భార్యపైనే అధిక ప్రేమను చూపిస్తూ, మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుందని వాస్తు చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సభ్యుల మధ్య వివక్ష ఏర్పడి.. అది అసూయకు, అశాంతికి దారితీస్తుంది. ఫలితంగా ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి తరచుగా గొడవలు జరుగుతుంటాయి.
మంచం మీద కూర్చుని తింటున్నారా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మంది టీవీ చూస్తూనో లేదా సోమరితనంతోనో మంచం మీద కూర్చుని భోజనం చేస్తారు. వాస్తు శాస్త్రం దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. భోజనాన్ని దేవుని నైవేద్యంగా భావించాలి. నిద్రించే మంచంపై కూర్చుని తినడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే అవుతుంది. మంచం మీద కూర్చుని తినడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదని, ఇది ఆర్థిక అస్థిరతకు, దారిద్య్రానికి దారితీస్తుందని వాస్తు హెచ్చరిస్తోంది.
శాంతి, శ్రేయస్సు కోసం ఏం చేయాలి?
ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి..
- ఎప్పుడూ కింద కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ వద్ద క్రమశిక్షణతో భోజనం చేయండి.
- ఆహారం తినే ముందు కృతజ్ఞతలు చెప్పుకోవడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుంది.
- అందరూ కలిసి కూర్చుని తిన్నా, ఎవరి ప్లేట్‌లో వారు తినడం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ గౌరవం పెరుగుతాయి.
(Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, స్వప్నశాస్త్రానికి సంబంధించిన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.)
