Donald Trump: తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన డొనాల్డ్ ట్రంప్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్-అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం హైదరాబాద్ ఇమేజ్‌ను మరోసారి అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లింది. తాజాగా హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ మార్గంలోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టగా.. దానిపై స్పందించిన ట్రంప్, ధన్యవాదాలు తెలుపుతూ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక పోస్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో గల అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టడంపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా అయిన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అందులో తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటివరకు విదేశాల్లో ఈ తరహా గౌరవాన్ని పొందిన తొలి అమెరికన్ ప్రెసిడెంట్‌గా తానేనని ఆయన పేర్కొన్నారు.
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఈ నెల 23న హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేశారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ-అమెరికా మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేసేందుకు, హైదరాబాద్‌కు ఉన్న ఇమేజ్‌ను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
