Tirumala Temple: శ్రీ ప్లవనామ సంవత్సర ప్రారంభం, ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహిస్తున్నారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పన చేశారు. ఇక ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య విమానా ప్రాకారం నిర్వహించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను అలంకరిస్తారు. ఈ పూజా క్రతువులు పూర్తయిన తరువాత.. ఉగాది ఆస్థానంలో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
ఈ వేడుకను పురస్కరించుకుని పరిలయ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఫల, పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను అందంగా అలకరించారు. కాగా, ఏటా ఉగాది పర్వదినం వేళ తిరుమలలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే గతేడాది ఉగాది సమయానికి కరోనా మహమ్మారి వ్యాప్తి విస్తృతంగా ఉంది. అదే సమయంలో లాక్‌డౌన్ కూడా అమల్లో ఉంది. దాంతో ఆలయ అధికారులు.. తిరుమలలో ఉగాది వేడుకలను అంతంత మాత్రంగా నిర్వహించారు. ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం, భక్తుల దర్శనాలు కూడా కొనసాగుతున్న క్రమంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తింది.
ఇదిలాఉంటే.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవల, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.
Also read: