Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) . కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడు.. భక్తుల పాలిట కల్ప వృక్షంగా స్వామివారు పూజలను అందుకున్నాడు. శీవారిని దర్శించుకోవడానికి తెలుగురాష్ట్రాల నుంచే కాదు.. దేశ విదేశాలనుంచి కూడా భక్తులు వస్తారు. తమ స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే చాలామంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ.. అవి తీరాలని ముడుపు కడతారు. తమ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆ ముడుపుని అత్యంత భక్తి శ్రద్దలతో స్వామివారికి చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొండలరాయుడికి ముడుపులు ఎలా కట్టాలి.. అనే విషయం తెలుసుకుందాం..
ఎటువంటి సమస్యలకు ముడుపులు కడతారంటే.. అనారోగ్యంతో ఉన్నవారు.. కోలుకోవడం కోసం, త్వరగా వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, సంతానం కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, పంటలు బాగా పండాలని.. చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగాలని.. ఇలాంటి సమస్యలు తీరాలంటూ శ్రీనివాసుని కి ముడుపు కడతారు..
ముడుపు కట్టే పద్దతి:
ముందుగా ఒక తెల్లటి కొత్త బట్టని తీసుని.. తడిపి పుసుపు రాసి.. ఆరబెట్టాలి. వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక విన్నవించాలి. అనంతరం శ్రీవారికి తాను ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకొని.. అనంతరం పసుపు రాసిన బట్టని తీసుకుని.. దానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టాలి. ఇలా చేస్తున్న సమయంలో తమ సమస్య.. ఎందుకు ముడుపు కడుతున్నారో మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకోవాలి. అనంతరం డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి శ్రీ వెంటకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి. తన కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, గోవిందా నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని పెద్దల నమ్మకం.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ అధరాలు లేవు. టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.)
Also Read: TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల దరఖాస్తు ఫీజు చెల్లింపులకు నేడే ఆఖరు! వెంటనే..