గత నెలలో వచ్చిన వచ్చిన గోదావరి (Godavari) వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను తనలో కలిపేసుకున్న గోదారి ఎన్నో కుటుంబాలను కకావికలం చేసింది. వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే బాధితులు కోలుకుంటున్నారు. అయితే వరదల వల్ల ప్రజలే కాదు. దేవాలయాలకూ ముప్పు వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో దేవాలయానికి వరద ముంపు పొంచి ఉంది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం లాంచీల రేవు వద్ద ఏటిగట్టు కోతకు గురవుతోంది. దీంతో గట్టుపై ఉన్న శివాలయం గోడలు దెబ్బతిన్నాయి. శివాలయం ప్రాంగణంలోకి వరద నీరు వచ్చి చేరింది. శివాలయానికి ఏ క్షణమైనా వరద ముప్పు జరగవచ్చని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివాలయం కూలిపోతుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఇప్పటికే గోదావరి వరద ప్రవాహానికి తట్టుకోలేక జులై 29న పురుషోత్తపట్నంలో గోదావరి ఎడమ గట్టున ఉన్న వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది. శ్రావణమాసం తొలి శుక్రవారం రోజు ఉదయం మహిళలు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. సాయంత్రానికి అమ్మవారి విగ్రహం సహా ఆలయం నీటిలో కొట్టుకుపోయింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..