శివుడి మూడో కన్ను.. మకర తోరణం.. వీటి వెనుకున్న రహస్యం తెలుసా..?

Lord Shiva: ప్రతి పెద్ద దేవాలయంలో మనకు మకర తోరణంను దర్శించవచ్చు. మకరతోరణం అనేది దేవాలయంలోని ప్రధాన దేవత విగ్రహం వెనుక ఉండే, అందమైన లోహం లేదా శిల్పాలతో అలంకరించిన తోరణం. ఎక్కువ మంది దీనిని కేవలం అలంకరణగా మాత్రమే చూస్తారు, కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణకథ ఉంది. ఈ కథ స్కంద మహాపురాణంలో వర్ణించబడింది.

శివుడి మూడో కన్ను.. మకర తోరణం.. వీటి వెనుకున్న రహస్యం తెలుసా..?
Lord Shiva

Updated on: Mar 12, 2026 | 1:43 PM

హిందూ ధర్మంలో మకరతోరణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి దేవాలయంలోనూ మనకు దర్శనిమిస్తుంది. మకరతోరణం అంటే దేవాలయాల్లోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న అందమైన అర్ఘం వంటి లోహం లేదా శిల్పంతో అలంకరించిన తోరణం. చాలా మందికి ఇది ఒక అలంకరణగా మాత్రమే కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణకథ ఉంది. అది స్కంద మహాపురాణంలో వర్ణించబడింది.

కీర్తిముఖుని దురాశ

పూర్వకాలంలో కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు. ఈ శక్తివంతమైన రాక్షసుడు భువనాల్లోని అన్ని సంపదలను స్వాధీనం చేసుకుని.. చివరకు పరమశివుని భార్య జగన్మాతని కూడా స్వంతం చేసుకోవాలని ప్రయత్నించాడు.

కీర్తిముఖుడి దురాశను చూసి ఆగ్రహించిన శివుడు.. అతన్ని సంహరించేందుకు ఒక భయంకరమైన అగ్నిని సృష్టించాడు. కీర్తిముఖుడు మరణం ఉండదు అనే వరం పొందినప్పటికీ.. ఆ అగ్ని తనను దహించకూడదని భయపడుతూ అన్ని లోకాలను పరుగులు పెట్టాడు. చివరికి, అతడు శివుని శరణు కావాల్సి వచ్చింది.

శివుని అనుగ్రహం

శివుడు.. భక్తుల సులభుడు కాబట్టి.. ఆ అగ్నిని తన మూడో కన్ను ద్వారా అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి శివుడు త్రినేత్రుడుగా ప్రసిద్ధి చెందాడు.

అయితే, కీర్తిముఖుడు తన ఆకలిని శివుని ముందు వ్యక్తం చేసాడు. శివుడు, “నిన్ను నువ్వే తిను!” అని ఆదేశిస్తాడు. దీనికి కీర్తిముఖుడు అంగీకరించి.. మొసలి రూపంలో తనను తానే తినడం మొదలుపెట్టాడు. కానీ తలని ఎలా తినాలో అతనికి తెలియదు. అప్పుడు మళ్లీ శివుడిని ప్రార్థిస్తాడు.

అప్పుడు శివుడు అతనికి ఈ వరం ఇచ్చారు. “ఇప్పటి నుంచి, అన్ని దేవాలయాల్లోని విగ్రహాల వెనుక మధ్యభాగాన్ని నీకు భోజనంగా ఉంచుతాం. భక్తుల లోపల ఉండే దురహంకారం, అహంకారం, దురాశను తిను. ఇలా చేస్తూ, నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు” అని కీర్తిముఖుడిని శివుడు అనుగ్రహించాడు.

మకరతోరణం ఏర్పడిన విధానం

అప్పటినుంచి, దేవాలయాల విగ్రహాల వెనుక మధ్యభాగంలో తోరణంలా.. కీర్తిముఖుడును ప్రతిష్టించారు. భక్తుల లోపల ఉన్న దుష్టమైన ఆలోచనలు, అహంకారం, దురాశను అణచి.. శుభ భావాలను పెంపొందించడమే కీర్తిముఖుడి కర్తవ్యంగా మారింది.
ఈ కారణంగానే, ఆ ప్రత్యేకమైన తోరణాన్ని మకరతోరణం అని పిలుస్తారు.

దేవాలయానికి సందర్శించినప్పుడు..

కీర్తిముఖుడు ఆహారంగా భక్తులలోని దురాశలను మాత్రమే తింటాడు. కాబట్టి, దేవాలయానికి మనం వచ్చే ప్రతిసారి మనలో ఆశ, కోపం, అహంకారం వదిలి.. శాంతితో, భక్తితో రావడం ముఖ్యమని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us