వసంత పంచమి వేళ ఆలయంలో హిందువులతో పాటు ముస్లింల ప్రార్ధనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

మధ్యప్రదేశ్‌ ధార్‌ భోజ్‌శాల ఆలయం వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వసంత పంచమి వేడుకల వేళ ఆలయంలో హిందువులతో పాటు ముస్లింలు ప్రార్ధన చేసుకోవడానికి అనుమతించింది. న‌మాజ్‌కు వ‌చ్చే ముస్లింలు జిల్లా యాజ‌మాన్యం వ‌ద్ద త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాలని సూచించింది.

వసంత పంచమి వేళ ఆలయంలో హిందువులతో పాటు ముస్లింల ప్రార్ధనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
Bhojshala Kamal Maula Mosque

Updated on: Jan 22, 2026 | 9:04 PM

మధ్యప్రదేశ్‌ లోని ధార్‌ జిల్లా భోజ్‌శాల ఆలయం వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వసంతపంచమి వేడుకల వేళ ఆలయంలో హిందువులతో పాటు ముస్లింలు ప్రార్ధన చేసుకోవడానికి అనుమతించింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు నమాజ్‌ చేసుకోవడానికి ముస్లింలకు అనుమతి ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వసంత పంచ‌మి రోజున సూర్యోద‌యం నుంచి సూర్యాస్తమ‌యం వ‌ర‌కు హిందువులు పూజ‌లు చేసుకోవ‌చ్చని, అలాగే ఆ రోజున మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య ముస్లింలు ప్రార్థన‌లు చేసుకోవ‌చ్చు అని సుప్రీం పేర్కొంది.

అయితే న‌మాజ్‌కు వ‌చ్చే ముస్లింలు జిల్లా యాజ‌మాన్యం వ‌ద్ద త‌మ పేర్లను న‌మోదు చేయాల్సి ఉంటుంద‌ని కోర్టు ఆదేశించింది. వసంత పంచ‌మి సంద‌ర్భంగా శుక్రవారం భోజ్‌శాల‌లో స‌రస్వతీదేవి పూజ నిర్వహించ‌నున్నారు. చీఫ్ జ‌స్టిస్ సూర్యకాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, విపుల్ పాంచోలితో కూడిన ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు ఇచ్చింది. రెండు వ‌ర్గాల ప్రజ‌లు ఒక‌రికి ఒక‌రు స‌హ‌క‌రించుకోవాల‌ని, అలాగే రాష్ట్ర, జిల్లా ప్రభుత్వ యాజ‌మాన్యానికి స‌హ‌క‌రించాల‌ని కోర్టు పేర్కొన్నది. వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా దార్‌లో సుమారు 8 వేల మంది పోలీసుల్ని మోహ‌రించారు. అవాంఛనీయ సంఘట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2003లోనే ఆర్కియాల‌జీ స‌ర్వే ఆఫ్ ఇండియా ముస్లింల ప్రార్థన‌ల విష‌యంలో కీల‌క ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం రోజున మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 మ‌ధ్య ప్రార్థన‌లు చేసుకోవ‌డానికి వీలు క‌ల్పించింది. వ‌సంత పంచ‌మి రోజున హిందువులు పూజ‌లు చేసుకోవ‌చ్చు అని, మంగ‌ళ‌వారం కూడా పూర్తి స్థాయిలో పూజ‌లు చేసుకునేందుకు ఏఎస్ఐ అనుమ‌తి ఇచ్చింది. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు మూడు సార్లు మాత్రమే వసంత పంచ‌మి-శుక్రవారం క‌లిసి వ‌చ్చాయ‌ని, 2006..2013.. 2016 సంవ‌త్సరాల్లో ఇలాంటి సంద‌ర్భం ఎదురైంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..