Srirangam Temple: రంగనాథ స్వామి కోసం 12,000 మంది భక్తుల మహత్తర ప్రాణ త్యాగం.. ఈ చరిత్ర మీకు తెలుసా…?

Srirangam Ranganathaswamy Temple: శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దిల్లీ సుల్తానుల నుండి రక్షించడానికి 1323లో 12,000 మంది భక్తులు ప్రాణత్యాగం చేశారు. స్వామివారి విగ్రహాన్ని కాపాడేందుకు అర్చకులు గోడ కట్టగా, భక్తులు మానవహారంగా నిలబడి శత్రువులను అడ్డుకున్నారు. వారి అంకితభావం వల్ల 48 ఏళ్ల తర్వాత స్వామివారు మళ్లీ భక్తులకు దర్శనమిచ్చారు.

Srirangam Temple: రంగనాథ స్వామి కోసం 12,000 మంది భక్తుల మహత్తర ప్రాణ త్యాగం.. ఈ చరిత్ర మీకు తెలుసా...?
Srirangam Temple

Updated on: Feb 04, 2026 | 9:58 PM

తమిళనాడులోని శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం భూలోక వైకుంఠంగా విరాజిల్లుతూ, అనంత శేషునిపై శయనించిన పరమాత్మ స్వరూపాన్ని దర్శింపజేస్తుంది. భక్తుల హృదయాల్లో భక్తి, శరణాగతి, వైరాగ్య భావాలను మేల్కొలిపే ఈ దివ్యక్షేత్రం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూలస్తంభంగా నిలిచింది. ఆలయ ప్రాకారాలు భౌతిక బంధనాల నుంచి ఆత్మను క్రమంగా విముక్తి దిశగా నడిపించే ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తాయని ఆచార్యులు భావిస్తారు.

ఇక్కడ జరిగే నిత్య ఆరాధన, ఉత్సవాలు, వేద పారాయణలు భక్తుడిని పరమార్థ తత్త్వం వైపు మళ్లిస్తాయి. శ్రీ రంగనాథుని దివ్య దర్శనం ద్వారా జీవుడు అహంకారాన్ని విడిచి, దైవ శరణాగతిలో లీనమై మోక్ష సాధన దిశగా ప్రయాణిస్తాడు. ఈ ఆలయం కేవలం శిలల సమాహారం కాదు.. ఇది భక్తి, జ్ఞానం, కర్మ సమన్వయంతో వికసించిన ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం. ఇప్పుడీ ఆలయం ఇలా ఉందంటే.. దాని వెనుక చాలా మంది ప్రాణ త్యాగం ఉంది. ఈ ఆలయం రక్షణ కోసం వేలాది మంది భక్తులు తమ ప్రాణాలు త్యాగం చేయడం గమనార్హం.

ఢిల్లీ సుల్తానుల దాడి..

శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన ఒక అద్భుతమైన, త్యాగభరితమైన చరిత్ర ఉంది. 1323లో ఢిల్లీ సుల్తానులు ఈ ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు.. ఆలయాన్ని రక్షించడానికి సైనిక బలం లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అర్చకులకు స్వామివారి మూల విరాట్టును సురక్షితంగా దాచడానికి కొంత సమయం అవసరమైంది.

ప్రాణం తీస్తున్నా…

అప్పుడు 12,000 మంది సాధారణ భక్తులు గుడి ద్వారం ముందు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒక మానవ హారంలా నిలబడ్డారు. శత్రు సైన్యం వారిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నా కూడా.. వారు తమ స్థానం నుంచి కదలలేదు. అదే సమయంలో, అర్చకులు 21 అడుగుల స్వామివారి మూల విరాట్టు కనిపించకుండా గర్భగుడి ముందు ఒక గోడను నిర్మించారు. ఆ గోడ పాతదిగా కనిపించడానికి దానిపై మట్టిని పూశారు.

ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన శత్రువులు ఆ గోడను చూసి, విగ్రహాన్ని వేరే చోటికి తరలించారని నమ్మి, దొరికిన సంపదతో వెనుదిరిగారు. సరిగ్గా 48 సంవత్సరాల తర్వాత.. విజయనగర రాజుల ఆధ్వర్యంలో ఆ గోడను పగలగొట్టి చూడగా, స్వామివారు చెక్కుచెదరకుండా దర్శనమిచ్చారు. భవిష్యత్ తరాలకు ఈ దైవాన్ని అందించాలనే ఆ 12,000 మంది భక్తుల మహత్తర త్యాగం ఫలించింది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, భక్తికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికీ ఆ రంగనాథ స్వామితోపాటు ఆ మహా భక్తుల త్యాగాలను స్మరించుకుంటారు.