Varalakshmi Vratam Gaja Lakshami: హిందూ దేవతల్లో లక్ష్మీదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విష్ణువు భార్య లక్ష్మి .. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతల్లో ఒకరు. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు.లక్ష్మిదేవి చీర కట్టుకొని, అభరణాలను ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. లక్ష్మిదేవి నాలుగు చేతులతో వుంటుంది. రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ వుంటుంది. తామర పువ్వు మీద కూర్చుని ఏనుగులతో భక్తులను అనుగ్రహిస్తుంది.
అయితే లక్ష్మీదేవి అష్ట లక్ష్మి అవతారాలతో దర్శనం ఇస్తుంది. ఈ అష్టలక్ష్ముల్లో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూచుంటుంది గజలక్ష్మి. ఇరుపక్కలా రెండు ఏనుగులు ఉంటాయి. యోగముద్రలో కూర్చుని ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై చేతులలో తామర పువ్వులు ఉంటాయి. కింది చేతులు అభయ, వరద ముద్రలు చూపిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి సమృద్ధికి, సంపదకు, అదృష్టానికి, గౌరవానికి, దర్జాకు, దర్పానికి సంకేతం.
అయితే గజలక్ష్మి సర్వసంపత్కరి..పరమపవిత్రకు చిహ్నం. ఈ విషయం చెప్పడానికే ఏనుగులు తొండంతో నీరు చిమ్ముతూ అమ్మవారికి అభిషేకం చేయిస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. తామర పువ్వుకే పద్మం అని మరో పేరు కూడా ఉంది. పద్మంలో ఉండే తల్లి కాబట్టి ఆమెను పద్మ, పద్మిని అని కూడా పిలుస్తారు. ఈ పద్మం నవనిధులలో ఒకటి. పద్మం అనే నిధిలో కూచునే తల్లి కనుక ఆమెను సంపదదాయిని, భాగ్యదాయినిగా ఆరాధిస్తారు. సామాజికంగా ఆలోచించినపుడు సంపద చంచలమైంది. ఎవరి వద్దకు డబ్బులు సంపద ఎప్పుడు వస్తుందో .. ఎప్పుడు పోతుందో, ఎంతకాలం ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. పరమ చపలమైంది. ఇవాళ కోటీశ్వరుడుగా ఉన్నవాడు తెల్లారేలోపు భిక్షాధికారి అయి దేహీ అని రోడ్డున పడుతున్నాడు. ఈ చంచలత్వానికి, చాపల్యానికి తామర ఒక సంకేతం. సరసులో పద్మం నిలకడగా ఉండదు. అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది. దాని మీద కూచున్న లక్ష్మి పద్మాన్ని కదిలిపోకుండా నిరోధిస్తుంది. అలా కూచునే లక్ష్మి యోగముద్రలో ఉంటుంది.
నిలకడలేని సంపదకు కుదురు తెచ్చేది యోగం మాత్రమే అన్న సందేశం ఇందులో ఉంది. యోగబుద్ధితో సంపదలను అనుభవించే వారికి ఆ సంపద మీద వ్యామోహం ఉండదు. కనుక సంపదను ఎవరైనా స్వార్ధ బుద్ధితో కాక త్యాగబుద్ధితోనే అనుభవించాలని గజలక్ష్మి ఉపదేశిస్తోంది. ఇలా సిరిసంపదలను నిర్మోహత్వంతో అనుభవించేవారే సర్వసమర్థులనీ, శక్తిశాలురనీ, వారిని లోకమంతా ఆరాధిస్తుందని చెబుతుంది. ఈ మాట చెప్పడానికే ఏనుగులు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నట్టుగా, అభిషేకిస్తున్నట్టుగా చిత్రాలలో చూపిస్తారు.
Also Read: ఆ దేశంలోని ఫైళ్లలో సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ .. 100 ఏళ్ల వరకు చెప్పరట ఎందుకంటే