
ప్రపంచం మొత్తం దీపావళి సంబరాల్లో మునిగిపోయిన ఈ సమయంలో.. సద్గురు ఒక మంచి సందేశంతో ముందుకొచ్చారు. ఈ పండుగ అసలు అర్థం ఇళ్ల ముందు దీపాలు వెలిగించడం మాత్రమే కాదు.. మన మనసులోని చీకట్లను తరిమి.. మనలోని వెలుగు మెరవాలి అని ఆయన గుర్తుచేశారు. “చీకటిని తొలగించడం వెలుగు స్వభావం. మీలోని వెలుగు పెరిగి, మీరు తాకిన ప్రతి ఒక్కరికీ ఆ ప్రకాశం చేకూరాలని కోరుకుంటున్నాను” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
Obliteration of darkness is the nature of Light.
May your inner Light grow – to illuminate you and all that you touch.
A Dazzling Diwali to you.Love & Blessings,
Sadhguru pic.twitter.com/KRubFdSDED— Sadhguru (@SadhguruJV) October 20, 2025
దీపావళి వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందని సద్గురు చెప్పారు. ఈ కాలంలో ఉత్తరార్థగోళం సూర్యుని నుంచి కొంత దూరమవుతుంది. అందుకే వాతావరణం చల్లగా మారుతుంది, సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మనుషుల్లోనూ కొంత నిస్సత్తువ, అలసట, మానసిక దిగులు వస్తుందని చెప్పారు. అప్పుడు మన చుట్టూ, మనలో వెలుగు నింపుకోవాల్సిన సమయం అదే. అందుకే దీపం వెలిగించడం ఆచారం అయింది అని సద్గురు వివరించారు. వివిధ నూనెలతో దీపాలు వెలిగించొచ్చు కానీ ఆముదం అందుకు ఉత్తమం అని సద్గురు చెప్పారు. దానికి పొగ తక్కువగా వస్తుంది. శుభ్రంగా, సాఫీగా వెలిగుతుందని వివరించారు.
భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది. దీపావళి అంటే మనలోని మంచి వెలిగించడమే. మనం భయం లేకుండా, లోభం లేకుండా, నేరభావం లేకుండా జీవించగలిగితే.. అదే నిజమైన మానవత అని సద్గురు వెల్లడించారు. ‘భయం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం జరగని విషయాలను ఊహిస్తాం. లోభం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనకు ఉన్నదానితో సంతృప్తి లేకపోవడం. నేరభావం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ఇతరుల్ని మనలాగా భావించం. ఈ మూడింటినీ జయించినప్పుడు మనలోని వెలుగు ప్రకాశిస్తుంది’ అని ఆయన చెప్పారు. సో సద్గురు చెప్పినట్లు ఈ దీపావళి మన ఇల్లే కాదు… మన మనసును కూడా వెలిగిద్దాం.