కలల అసలు గుట్టు.. పదే పదే వచ్చే కలల వెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాలు..

మీ కలలలో ఒకే వ్యక్తి పదే పదే వస్తున్నారా.. ఆ జ్ఞాపకం నిద్ర లేచిన తర్వాత కూడా మిమ్మల్ని వెంటాడుతోందా..? వాస్తవానికి ఆ వ్యక్తి మీకు ఆమడ దూరంలో ఉండవచ్చు.. కానీ మీ కలల ప్రపంచంలో మాత్రం ప్రతిరోజూ ఎందుకు కనిపిస్తున్నారు..? ఇది కేవలం యాదృచ్చికమా లేక మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు పంపిస్తున్న బలమైన సంకేతమా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కలల అసలు గుట్టు.. పదే పదే వచ్చే కలల వెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాలు..
Why Do You See The Same Person Repeatedly In Dreams

Updated on: Jan 25, 2026 | 4:58 PM

కలల ప్రపంచం ఒక రహస్యం. రాత్రి పడుకున్న తర్వాత మన ప్రమేయం లేకుండానే మనల్ని పలకరించే ఆ వింత లోకానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటాయి. మీ కలలలో ఒకే వ్యక్తి పదే పదే కనిపిస్తున్నారా? అయితే అది మీ మనస్సు మీకు ఇస్తున్న సంకేతం కావచ్చు. నిద్ర లేచిన తర్వాత కూడా మీ మనసులో ఒక వ్యక్తి ముఖం అలాగే మెదులుతోందా? వాస్తవానికి ఆ వ్యక్తి మీకు చాలా దూరంలో ఉండవచ్చు. కానీ మీ కలలలో మాత్రం పదే పదే పలకరిస్తున్నారా..? మనస్తత్వ శాస్త్రం ప్రకారం.. ఇలా ఒకే వ్యక్తి లేదా ఒకే సంఘటన మళ్లీ మళ్లీ కలలలోకి రావడం వెనుక లోతైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కలలు: మనస్సు భాష

మనం రోజంతా అనుభవించే భావోద్వేగాలు, భయాలు, అణచివేయబడిన కోరికలను మన మెదడు నిద్రలో ప్రాసెస్ చేస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం.. కలలు అనేవి మన ఉపచేతన మనస్సు మనతో మాట్లాడే ఒక భాష. మీకు ఎవరితోనైనా గొడవ జరగడం, విడిపోవడం లేదా చెప్పలేని ప్రేమ ఉండటం వంటివి జరిగినప్పుడు.. ఆ వ్యక్తులు మీ కలలలోకి వచ్చే అవకాశం ఎక్కువ. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడేటప్పుడు వింత వ్యక్తులు లేదా ప్రమాదాలు కలలలో కనిపిస్తాయి.

ప్రముఖ నిపుణులు ఏమంటున్నారు?

కలల విశ్లేషణపై ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..

సిగ్మండ్ ఫ్రాయిడ్: ప్రతి కలా ఒక కోరిక నెరవేరడమే. మన మనస్సులో దాగి ఉన్న, బయటకి వ్యక్తపరచలేని కోరికలే కలల రూపంలో వస్తాయని ఈయన అభిప్రాయపడ్డారు.

కార్ల్ జంగ్: వాస్తవ ప్రపంచం చాలా క్లిష్టంగా ఉన్నప్పుడు, మన మనస్సు చిహ్నాల ద్వారా విషయాలను వివరిస్తుంది. అందుకే వింత ఇళ్లు, తెలియని వ్యక్తులు కలలలో కనిపిస్తారు.

డాక్టర్ డీర్డ్ బారెట్: పదే పదే వచ్చే పీడకలలు మనలో అణచివేయబడిన భయం లేదా గతంలో జరిగిన గాయాలకు సంకేతాలని ఈమె వివరించారు.

ఆధ్యాత్మిక కోణం: ఆధ్యాత్మికంగా చూస్తే.. ఒకే వ్యక్తిని పదే పదే కలగనడం అనేది ఆ వ్యక్తితో ఉన్న “కర్మ సంబంధం” లేదా ఆత్మ సంబంధానికి నిదర్శనమని కొందరు నమ్ముతారు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

జాగ్రత్త పడాల్సిన సమయం ఎప్పుడు?

  • కలల వల్ల మీరు తీవ్రమైన అసౌకర్యానికి లోనవుతుంటే..
  • ఆ కలలు మీ దైనందిన జీవితాన్ని, పనిని ప్రభావితం చేస్తుంటే..
  • పదే పదే భయం లేదా విచారంతో నిద్ర మేల్కొంటుంటే..

కలలు అనేవి కేవలం ఊహలు కావు, అవి మన మానసిక స్థితిని ప్రతిబింబించే అద్దాలు. మీ మనస్సులో లోతుగా దాగి ఉన్న భావాలను అర్థం చేసుకుంటే, ఆ పదే పదే వచ్చే కలల గుట్టు విడిపోతుంది.