శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదం వివాదంలో చిక్కుకుంది. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శబరిమల ప్రసాదం ‘అరవణ పాయసం’లో ఉపయోగించే యాలకుల నాణ్యతపై తాజాగా వివాదం అలముకొంది. దీనిపై కేరళ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను ధర్మాసనం గురువారం విచారించనుంది. ఇక ఇప్పటికే అరవణ తయారీకి ఉపయోగించే యాలకులను సరఫరా చేసే అయ్యప్ప స్పైసెస్ నుంచి కోర్టు వివరణ కోరింది. మరోవైపు తిరువనంతపురంలోని ఫుడ్ టెస్టింట్ ల్యాబొరేటరీ దీనికి సంబంధించిన నివేదికను సమర్పించింది.
తాజా నివేదిక ప్రకారం.. అయ్యప్ప ప్రసాదంలో ఉపయోగించే యాలకుల్లో అనుమతించిన పరిమితికి మించి రసాయనాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నివేదికను గురువారం హైకోర్టులోని ద్విసభ్య బెంచ్ ముందు సమర్పించనున్నట్లు సమాచారం. కాగా గతంలో శబరిమల అరవన ప్రసాదం తయారీకి గవిలోని కేరళ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్లాంటేషన్ నుంచి యాలకులు సరఫరా జరిగేది. శబరిమల భక్తుల రద్దీ దృష్ట్యా అరవణ ప్రసాదం ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని గత నవంబర్‌లో శబరిమల స్పెషల్ కమిషనర్ హైకోర్టుకు విన్నవించారు. అరవణ ప్రసాదం నాణ్యత కూడా పెంపొందించాలని కమిషనర్ సిఫార్సు చేశారు. ఇది జరిగిన కేవలం నెలల వ్యవధిలోనే అరవణ పాయసం నాణ్యతపై కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.