Pagididda Raju Jathara: ఘనంగా పగిడ్డిరాజు తిరుగురువారం జాతర.. పగిడిద్దరాజు, సమ్మక్కలకు నాగవెల్లి జరిపించిన ఆదివాసీలు

|

Feb 26, 2022 | 7:23 PM

Pagididda Raju Jathara: మేడారం(Medaram)లో కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క(Sammakka) తల్లి దర్శనమిస్తే, పూనుగొండ్ల (Punugondla) లో వెదురు చెట్టు రూపంలో సమక్క భర్త పగిడిద్దరాజు దర్శనమిచ్చాడు

Pagididda Raju Jathara: ఘనంగా పగిడ్డిరాజు తిరుగురువారం జాతర.. పగిడిద్దరాజు, సమ్మక్కలకు నాగవెల్లి జరిపించిన ఆదివాసీలు
Pagididda Raju Jathara
Follow us on

Pagididda Raju Jathara: మేడారం(Medaram)లో కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క(Sammakka) తల్లి దర్శనమిస్తే, పూనుగొండ్ల(Punugondla) లో వెదురు చెట్టు రూపంలో సమక్క భర్త పగిడిద్దరాజు దర్శనమిచ్చాడు. వెదురు చెట్టును పగిడిద్దరాజుగా భావించి.. పూజించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు. శివసత్తుల పూనకాలు. డోలు వాయిద్యాల మధ్య పూజారులు పగిడిద్దరాజు వనాన్ని పగిడిద్దరాజు ఆలయానికి తీసుకొచ్చారు. మహబూబబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడ్డిరాజు తిరుగురువారం జాతర వైభవంగా జరిగింది. మేడారం మహా జాతర అనంతరం పూనుగొండ్లలో పగిడిద్ద రాజు తిరుగువారం జాతరను మూడు రోజుల పాటు పూజారులు పెన్క వంశీయులు నిర్వహిస్తారు. పగిడిద్ద రాజును పూనుగొండ్ల సమీపంలోని దేవుడి గుట్ట నుంచి దేవాలయానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి జాతరను ప్రారంభించారు. దేవుడి గుట్ట నుంచి వెదురు రూపంలో ఉన్న పగిడిద్దరాజు వనాన్ని తెచ్చేందుకు అడవిలోకి వెళ్లారు. ఆదివాసీ సంప్రదాయంగా రహస్య పూజలు నిర్వహించి వెదురు చెట్టును తీసుకొచ్చారు. పగిడిద్దరాజు ప్రతిరూపంగా భావించే వెదురును తీసుకొస్తున్న సమయంలో భక్తులు పొర్లుదండాలతో.. నీళ్లు పోస్తూ స్వాగతం పలికారు. పగిద్దరాజును దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన అనంతరం దేవాలయంలో శాంతి పూజలు చేశారు. పగిడిద్దరాజు, సమ్మక్కలకు నాగవెల్లి జరిపారు.

వేర్వేరుగా తీసుకొచ్చిన సమ్మక్క, పగిడిద్దరాజుల పసుపు, కుంకుమలను కలిపి గద్దెలపై ఆడపడుచులు ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమాన్నే నాగవెల్లిగా పిలుస్తారు. పడగ రూపంలో ఉన్న పగిడిద్దరాజును గ్రామంలో ఊరేగించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు బుచ్చిరాములు, సురేందర్, రాజేశ్వర్, పురుషోత్తం, వెంకన్న ఆధ్వర్యంలో ఈ పూజలు జరిపారు.

Also Read:

భారత ప్రధాని మోడీతో మాట్లాడా.. భద్రతామండలిలో రాజకీయ మద్దతు కోరినట్లు తెలిపిన జెలెన్స్కీ