Chardham Yatra 2021: చార్‌ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేశారు. నైనిటాల్ హైకోర్టు కొన్ని ఆంక్షలతో నిషేధాన్ని ఎత్తివేసింది. స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం కోర్టును కోరింది. కరోనా కారణంగా, గతంలో చార్‌ధామ్ యాత్రను జూన్ 28 న హైకోర్టు నిషేధించింది. తాజాగా కోర్టు ఈ స్టే ఎత్తివేసింది. అయితే, చార్‌ధామ్ యాత్రకు వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందుగానే కోవిడ్-నెగటివ్ నివేదికను తీసుకురావాల్సి ఉంటుంది.
భక్తులు డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ పోర్టల్, దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాలలో జరగబోయే చార్‌ధామ్ యాత్రలో అవసరానికి తగినట్లుగా పోలీసు బలగాలను మోహరించాలని హైకోర్టు తన ఆదేశంలో కోరింది. ఇది కాకుండా, భక్తులు ఏ కొలనులోనూ స్నానం చేయడానికి అనుమతించ కూడదని కోర్టు చెప్పింది.
గతంలో కోర్టు ఆదేశాలతో యాత్రను నిలిపివేసిన ప్రభుత్వం..
చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ యాత్రపై వాయిదా కొనసాగుతుందని వెల్లడించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని.. విచారణ అనంతరం మరలా నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యాత్ర వాయిదా నేపథ్యంలో కొవిడ్ సంబంధ మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. అంతకుముందు చార్‌ధామ్ యాత్ర దేవాలయాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి-యమునోత్రిలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం యాత్రను పాక్షికంగా ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచి యాత్ర మొదటి దశను, జూలై 11 నుంచి యాత్ర రెండో దశను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. కోవిడ్ సూపర్ స్పైడర్‌గా మారకుండా యాత్రను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. మనోభావాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సర్కారు యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి: