భోజ్‌శాలపై హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. అది హిందూ దేవాలయమే.. పూజలకు గ్రీన్ సిగ్నల్!

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న చారిత్రాత్మక భోజ్‌శాల విషయమై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భోజ్‌శాలను ఒక దేవాలయంగా ప్రకటించడంతో పాటు, పూజలు చేసుకునే హక్కును కోర్టు మంజూరు చేసింది. శుక్రవారం (మే 15) హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఇది హిందూ పక్షానికి ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు.

భోజ్‌శాలపై హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. అది హిందూ దేవాలయమే.. పూజలకు గ్రీన్ సిగ్నల్!
Mp Bhojshala

Updated on: May 15, 2026 | 5:36 PM

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న చారిత్రాత్మక భోజ్‌శాల విషయమై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భోజ్‌శాలను ఒక దేవాలయంగా ప్రకటించడంతో పాటు, పూజలు చేసుకునే హక్కును కోర్టు మంజూరు చేసింది. శుక్రవారం (మే 15) హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఇది హిందూ పక్షానికి ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. “ఈ ప్రదేశంలో హిందూ పూజల కొనసాగింపు ఎన్నడూ ఆగలేదని గుర్తించాం. వివాదాస్పద ప్రాంతం పర్మార్ రాజవంశానికి చెందిన భోజ రాజుతో సంబంధం ఉన్న సంస్కృత విద్యా కేంద్రమైన భోజ్‌శాలగా ప్రసిద్ధి చెందిందని చారిత్రక గ్రంథాలు నిర్ధారిస్తున్నాయనిగమనించాము.” అని కోర్టు పేర్కొంది.

ఇది హిందూ దేవాలయం (వాగ్దేవి దేవాలయం) అవునా లేక ముస్లిం మసీదు (కమల్ మౌలా మసీదు) అవునా అన్నదే కోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న. “మేము భారత పురావస్తు శాఖ (ASI) వాస్తవాలు, నివేదికలను, అలాగే పురావస్తు శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రం అనే సూత్రాన్ని పరిగణనలోకి తీసుకున్నాము. ఏఎస్ఐ నిర్ధారణలపై ఆధారపడతాము.” అని కోర్టు పేర్కొంది. “ఇది ఒక సంరక్షిత కట్టడం అనేది స్పష్టం. దీని పర్యవేక్షణపై ఏఎస్ఐకి పూర్తి నియంత్రణ ఉంది. దాని పరిరక్షణను చేపట్టే అధికారం కూడా వారికే ఉంది.” అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మసీదు భూమి కోసం ముస్లిం పక్షం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఏఎస్ఐ చట్టంలోని శాసనబద్ధ నిబంధనలు, అయోధ్య కేసులో నెలకొన్న పూర్వ నిర్ణయం, పురావస్తు ఆధారాల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని, ఏఎస్ఐ నిర్వహించిన ఇటువంటి బహుళ-విభాగ అధ్యయనాల ఫలితాలపైనా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25, 26 కింద ఉన్న ప్రాథమిక హక్కులపైనా కోర్టు నిరభ్యంతరంగా ఆధారపడగలదని హైకోర్టు పేర్కొంది.

ధార్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. ఈరోజు శుక్రవారం (మే 15), సంప్రదాయాల ప్రకారం, ముస్లిం సమాజం శుక్రవారాల్లో భోజ్‌శాలలో ప్రార్థనలు చేస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈరోజు ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. తీర్పు వెలువడటానికి ముందు, నగర కూడళ్లలో దిగ్బంధనాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నారు. 1,000 మందికి పైగా పోలీసు అధికారులను మోహరించారు. అదుపుతప్పిన అల్లరిమూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా గౌరవించేలా చూసేందుకు ఇరు పక్షాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు, భారత పురావస్తు శాఖ (ASI) ఒక సవివరమైన శాస్త్రీయ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే 98 రోజుల పాటు కొనసాగింది మార్చి 22, 2024న ప్రారంభమై జూన్ 2024లో ముగిసింది. ASI జూలై 15, 2024న సుమారు 2,000 పేజీల సవివరమైన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం, ప్రస్తుత కట్టడాన్ని పూర్వం ఉన్న ఒక ఆలయ అవశేషాలు, స్తంభాలను ఉపయోగించి నిర్మించారు. అక్కడ పర్మార్ కాలానికి చెందిన శిల్పాలు, చెక్కిన రాళ్లు, శాసనాలు బయటపడ్డాయి.

ఈ వివాదం దశాబ్దాల నాటిది, కానీ 2022లో ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ దాఖలు చేసిన పిటిషన్ తర్వాత న్యాయపోరాటం తీవ్రమైంది. 2003 నాటి ఏఎస్ఐ ఉత్తర్వు ప్రకారం, హిందువులు ప్రతి మంగళవారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకోవడానికి, ముస్లింలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. మిగిలిన రోజులలో ఈ ప్రదేశం పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని మసీదుగా గుర్తించిన ధార్ సంస్థానం 1935 నాటి ఉత్తర్వును ముస్లిం పక్షం కోర్టుకు నివేదించింది.

ఇది 11వ శతాబ్దంలో రాజా భోజుడు నిర్మించిన సరస్వతీ దేవాలయం, గురుకులమని హిందువులు వాదిస్తున్నారు. ముస్లిం కార్యకలాపాలను నిషేధించాలని, హిందువులకు నిత్యం పూజలు చేసుకునేందుకు పూర్తి హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం పక్షం (మౌలానా కమలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ మాత్రం ఇది శతాబ్దాలుగా కమల్ మౌలా మసీదుగా ఉందని వాదిస్తున్నారు. వారు ASI సర్వే నివేదికను “పక్షపాతంతో కూడినది” అని పేర్కొంటూ, సర్వే సమయంలో పారదర్శకత పాటించలేదని వాదిస్తున్నారు. ఇదిలావుంటే, ఇటీవల, జైన సమాజం కూడా ఒక జోక్య పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ ప్రదేశం వాస్తవానికి ఒక జైన గురుకులం, దేవాలయం అని, అక్కడ లభించిన వాగ్దేవి విగ్రహం నిజానికి జైన యక్షిణి అంబిక అని వారు వాదిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us