Tiruvannamalai: అరుణాచలంలో అఖండ జ్యోతి కార్యక్రమం ఎప్పుడంటే…?

అరుణాచలంలో అఖండ జ్యోతి వేడకకు సర్వం సిద్ధమవుతోంది. మహా దీపోత్సవం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జరుగుతున్న ఏర్పాట్లపై నివేదిక కోరింది కోర్టు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

Tiruvannamalai: అరుణాచలంలో అఖండ జ్యోతి కార్యక్రమం ఎప్పుడంటే...?
Akhand Jyoti

Updated on: Nov 18, 2025 | 7:06 AM

తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21నుంచి డిసెంబర్‌ 7వరకు జరిగే కార్తీక దీపోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,667 అడుగుల కొండపై జరిగే కార్తీక దీపోత్సవ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన మహా దీపోత్సవం (అఖండజ్యోతి )డిసెంబరు 3న జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు 1,667 అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం (అఖండజ్యోతి )వెలిగిస్తారు. రాత్రి పంచమూర్తులను బంగారు వృషభ వాహనంలో ఊరేగిస్తారు.

అఖండ జ్యోతి ఏర్పాట్లపై మద్రాస్‌ కోర్టు కీలక ఉత్తర్వులు

మహో దీపోత్సవం నేపథ్యంలో తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవాలపై మద్రాస్‌ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 3న జరిగే కార్తీక మహా దీపోత్సవానికి తమిళనాడుతో పాటు ఆంధ్ర, కర్నాటక, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై పూర్తి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వం, డీజీపీ, జిల్లా యంత్రానికి ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ నెల 24లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. గిరి ప్రదక్షిణ రోజు ఎలాంటి తొక్కిసలాట, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో మహా దీపోత్సవం రోజున ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులెవరూ రావొద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేయడంతో.. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

దుర్గమ్మ ఉత్సవంతో మొదలై.. స్వామివారి వృషభ వాహన సేవతో ముగింపు

తరువణ్ణామలై ఈనెల 21 నుంచి డిసెంబర్‌ 7వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు 21న దర్గమ్మ ఉత్సవంతో మొదలై.. డిసెంబర్‌ 7న రాత్రి చండికేశ్వరస్వామి వెండి వృషభ వాహన సేవతో ముగుస్తాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఆంధ్ర, తెలంగాణ నుంచి తిరువణ్ణామలైకి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా కార్తీకమాసంలో అధికంగా భక్తుల రద్దీ పెరిగిందని చెబుతున్నారు.