Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. కిక్కిరిసిన భక్తజనం కారణంగా తిరుమల దర్శన క్యూలైన్‌లో వేచియున్న భక్తుడు మృతిచెందాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వేదాచలం అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్ లో సృహ తప్పి పడిపోయిన వేదాచలం అనే భక్తుడు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. క్యూలైన్ లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక వేదాచలం కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కానీ, మార్గ మధ్యలోనే వేదాచలం మృతి చెందాడు. ఆస్పత్రిలో అతన్ని పరిక్షించిన వైద్యులు అతడు మరణించినట్టు ధృవీకరించారు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వేదాచలం కిందపడిన వెంటనే బయటకు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందంటూ వాపోయారు. దాంతో ఆస్పత్రికి తరలించటంలో ఆలస్యం జరిగిందని కుటుంబీకులు రోధించారు.