
సద్గురు స్థాపించిన ఈషా అవుట్‌రీచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈషా గ్రామోత్సవం 2026 దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల పండుగగా మరోసారి ప్రారంభంకానుంది. ఈసారి 18వ ఎడిషన్‌ను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి విస్తరించారు. దేశవ్యాప్తంగా 40 వేలకుపైగా గ్రామాల నుంచి 80 వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్న ఈ టోర్నీలో మొత్తం రూ.1 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నారు.
ఇప్పటివరకు దక్షిణ భారత రాష్ట్రాలకే పరిమితమైన ఈ టోర్నీ, ఈసారి తొలిసారిగా ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలకు విస్తరించింది. వీటితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో కూడా పోటీలు నిర్వహించనున్నారు. 2004లో ప్రారంభమైన గ్రామోత్సవ చరిత్రలో ఇదే అత్యంత విస్తృత స్థాయి నిర్వహణగా నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ ఏడాది టోర్నీలో దాదాపు 7 వేల జట్లు పాల్గొననున్నాయి. వీటిలో 15 వేల మందికిపైగా మహిళా క్రీడాకారిణులు ఉంటారని అంచనా. పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించనున్నారు. జూలై రెండో వారం నుంచి క్లస్టర్ స్థాయి పోటీలు ప్రారంభమై, అనంతరం డివిజన్, రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. చివరకు సెప్టెంబర్ 6న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో సద్గురు సమక్షంలో గ్రాండ్ ఫైనల్ నిర్వహించనున్నారు.
విజేత జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించారు. వాలీబాల్, త్రోబాల్ విభాగాల్లో విజేతలకు రూ.5 లక్షలు, రన్నరప్ జట్లకు రూ.3 లక్షలు అందజేస్తారు. మూడో స్థానం సాధించిన జట్టుకు రూ.1 లక్ష, నాలుగో స్థానానికి రూ.50 వేల నగదు బహుమతి ఉంటుంది. క్లస్టర్, డివిజన్ స్థాయిలోనూ ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, పారా క్రీడాకారుల కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామోత్సవం కోఆర్డినేటర్ స్వామి పులక మాట్లాడుతూ, “ఈషా గ్రామోత్సవం ప్రతి ఏడాది మరింత విస్తరిస్తూ గ్రామీణ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి యువత ఒకే వేదికపై తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఇది” అని తెలిపారు. అర్హత కలిగిన గ్రామీణ జట్లు నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో జూలై 25 నుంచి ఆగస్టు 2 వరకు లక్నో, వారణాసి, ముజఫర్‌నగర్, మీరట్, గౌతమ్ బుద్ధ్ నగర్ ప్రాంతాల్లో క్లస్టర్ స్థాయి పోటీలు జరుగుతాయి. ఆగస్టు 9న లక్నోలో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ నిర్వహిస్తారు. అదే విధంగా హర్యానాలో పానిపట్, కర్నాల్, అంబాలా, హిసార్, కురుక్షేత్ర ప్రాంతాల్లో క్లస్టర్ పోటీలు నిర్వహించి, ఆగస్టు 9న కర్నాల్‌లో రాష్ట్ర ఫైనల్ జరగనుంది.
భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (NSPO)గా గుర్తింపు పొందిన ఈషా గ్రామోత్సవం, గ్రామీణ క్రీడాకారులకు వేదిక కల్పించడమే కాకుండా మహిళల భాగస్వామ్యం, గ్రామీణ సంస్కృతి, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. నిర్వాహకుల ప్రకారం, ఇప్పటివరకు 35 వేలకుపైగా గ్రామాల నుంచి 2.6 లక్షల మందికిపైగా గ్రామీణ క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.
ఈషా గ్రామోత్సవం 2026 కోసం గ్రామీణ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.