ఏపీలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయశాఖ పనితీరు బాగాలేదంటున్నారు. అన్యమత ప్రచారం కూడా జోరుగా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. హిందు మతాన్ని మట్టుపెట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరింది సాధు సమ్మేళన సమితి. ఏపీ, తమిళనాడు సరిహద్దులో సాధు సమ్మేళన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో దేవాదాయ శాఖ పనితీరు బాగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పుష్కరాల సమయంలో ఆలయాలు ధ్వంసం చేశారని గుర్తుచేశారు కమలానంద భారతి స్వామి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి. కొన్ని నెలలుగా ఆలయాల ధ్వంసం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మైనారిటీల మెప్పు కోసం దేవాలయాల ఆదాయాన్ని వినియోగిస్తున్నారని.. ఆలయాల వద్ద అన్యమత ప్రచారం జోరుగా జరుగుతోందని ఆరోపించారు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కమలానంద భారతి స్వామీజీ.
కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అధ్వర్యంలో త్వరలో తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ మహాసభ నిర్వహించబోతున్నట్టు స్వామీజీలు తెలిపారు. ఆలయాలపై దాడుల నియంత్రణకు, ఆస్తుల పరిరక్షణకు రిటైర్డ్ జడ్జితో, నిపుణులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఏపీలోని బీజేపీ, టీడీపీ నేతలు ఆలయల్లో విగ్రహాల ధ్వంసంపై పోరాటం చేస్తుండగా, ఇప్పుడు వీరికి పీఠాధిపతులు కూడా తోడయ్యారు. ఇప్పుడు ఈ అంశంపై ప్రతిపక్షాలు కూడా తమ పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంది.