విష్ణువు Vs శివుడు.. వీరిలో ఎవరు అత్యంత ఐశ్వర్యవంతులు..? నిజమైన సంపద ఏమిటి..?

గరికపాటి నరసింహారావు ప్రవచనం ప్రకారం.. నిజమైన ఐశ్వర్యం భోగాలలో కాదు, త్యాగం, వైరాగ్యం, దివ్య అనుగ్రహంలో ఉందని తెలుస్తుంది. శివుడు భోగాలన్నీ విడిచిపెట్టి, కేవలం భస్మంతో స్మశానంలో ఉంటాననడం ద్వారా అత్యున్నత త్యాగాన్ని ప్రదర్శించారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, నిస్వార్థ గుణాలకు ప్రతీక.

విష్ణువు Vs శివుడు.. వీరిలో ఎవరు అత్యంత ఐశ్వర్యవంతులు..? నిజమైన సంపద ఏమిటి..?
Vishnu and Shiva

Updated on: Feb 10, 2026 | 9:57 AM

గరికపాటి నరసింహా రావు ప్రసిద్ధ తెలుగు ప్రవచనకర్త, సాహితీవేత్త, అవధాని. ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. ఆయన ప్రవచనాలు ముఖ్యంగా రామాయణం, మహాభారతం, భాగవతం, అలాగే తెలుగు సాహిత్యం, ధర్మ–సంస్కృతి విషయాలపై ఉంటాయి. హాస్యం, పాండిత్యం, జీవితానుభవం.. మూడూ కలిపి మాట్లాడటం ఆయన ప్రత్యేకత. అందుకే గ్రామస్థాయి నుంచి విదేశాల వరకు ఆయనకు అభిమానులున్నారు. ఆయన ప్రవచనాలు ఆధ్యాత్మికతతోపాటు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని చాలా మంది చెబుతుంటారు. అందుకే ఆయన ప్రవచనాలు వినేందుకు చాలా మంది వెళుతుంటారు. సోషల్ మీడియాలోనూ ఆయన ప్రవచనాలు వింటూంటారు. ఇప్పుడు ఆయన చెప్పిన ఒక ఆసక్తికర అంశాన్ని గురించి తెలుసుకుందాం.

నిజమైన ఐశ్వర్యం..

ఆది దేవతలైన విష్ణువు, శివుడు.. వీరిలో ఎవరు అత్యంత సంపన్నులు అనే సందేహం కొందరిలో ఉంది. ఈ అంశంపై గరికపాటి ఆసక్తికర విశ్లేషణ చేశారు. నిజమైన ఐశ్వర్యం భోగభాగ్యాలలో కాదని, త్యాగం, వైరాగ్యం, దివ్య అనుగ్రహంలోనే ఉందని గరికపాటి నరసింహారావు తమ ప్రవచనంలో స్పష్టం చేశారు.

శివుడు కోరుకున్నది అదొక్కటే..

సృష్టిలో భోగాలు, రోగాలు, ఐశ్వర్యాలు, దారిద్ర్యాలు ఉన్నాయని విష్ణుమూర్తి పేర్కొనగా.. శివుడు అత్యంత త్యాగమూర్తిగా నిలిచారు. సకల భోగాలు, ఐశ్వర్యాలు, ఆభరణాలు విష్ణువు తీసుకోవాలని.. తాను కేవలం స్మశానంలో బూడిద పూసుకుని ఉంటానని శివుడు ప్రకటించారు. తనకు ఇంకేమీ అవసరం లేదని, చివరకు ఒక చెంబుడు నీళ్లు(జలంతో అభిషేకం) మాత్రమే చాలని పేర్కొన్నారు.

నిజమైన సంపద అదే..

ఈ అపూర్వమైన త్యాగం మనిషికి నిజమైన సంపద అంటే భౌతిక వస్తువులు కాదని, నిస్వార్థమైన జీవన విధానం, ఆధ్యాత్మిక జ్ఞానం అని తెలియజేస్తుంది. అన్నదమ్ములు వాటాలు పంచుకొనేటప్పుడు.. శివుడి వలె ఒకరు త్యాగం చేస్తే తక్షణమే కృతయుగం వస్తుందని గరికపాటి అన్నారు. నేటి సమాజంలో భక్తులు దేవతలను ఆరాధించినా, వారి నుంచి ఈ గొప్ప త్యాగాన్ని నేర్చుకోవడం లేదని ఆయన విశ్లేషించారు. శివుని ఈ వైరాగ్య గుణం అసలైన గొప్పతనానికి నిదర్శనం అని గరికపాటి నరసింహా రావు తెలిపారు.

(Disclaimer : ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)