అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ

Garikapati Narasimharao: తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు స్పష్టతనిచ్చారు. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గరికపాటి నరసింహరావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లు వస్తున్న వీడియో విక్రీకరించినదని ఆయన టీం స్పష్టం చేసింది.

అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
Garikapati Narasimha Rao

Updated on: Mar 20, 2026 | 6:36 PM

రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లు వస్తున్న వీడియో వక్రీకరించినదని ఆయన టీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సభలలో గరికపాటి నరసింహరావు అలా మాట్లాడలేదని వెల్లడించింది. ‘వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడూ పేదల పక్షమే. వారి ప్రసంగాలలో తరచుగా ధనవంతులు ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాలలో, పాఠశాలలో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.’ అని గరికపాటి టీం ఆ ప్రకటనలో వెల్లడించింది.

అంతేగాక, ‘శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళితవాడలలో ఉన్న స్త్రీలకు పంచి పెట్టాలని ఎన్నోసార్లు వారు(గరికపాటి) పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడూ పేదవాళ్ల పార్టీనే అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు. గురువుగారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుంచి దూరం చేయడానికి కొంత మంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున, ఇటువంటి కుతంత్రాలకు ఎవ్వరూ లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులంతా సమైక్యంగా, సర్వకుల సామరస్యంతో జీవించాలన్నదే గురువుగారి ఆకాంక్ష’ అని గరికపాటి నరసింహారావు బృందం వారి ప్రకటనలో స్పష్టం చేసింది.

Follow Us