
మరో మూడు రోజుల్లో మనం నూతన తెలుగు సంవత్సరమైన పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరంలో విజయాలు సాధించాలని, ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. అయితే ఈ సంవత్సరం శుభంగా ప్రారంభమవ్వాలంటే ఉగాది రాకముందే ఇంటికి కొన్ని శుభప్రదమైన వస్తువులను తీసుకురావాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వలన ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని, ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఇప్పుడు ఉగాదికి ముందు ఇంటికి తీసుకురావాల్సిన శుభప్రదమైన వస్తువుల గురించి మనం తెలుసుకుందాం.
మామిడి ఆకులను తీసుకువచ్చి తోరణాలుగా చేసి ఇంటి ముఖద్వారానికి కట్టాలి. మామిడి ఆకులు ఇంటికి శుభాన్ని తీసుకువస్తాయని, దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా కాపాడతాయని విశ్వాసం ఉంది. అలాగే సంపద, ఐశ్వర్యం కూడా పెరుగుతాయని అంటారు.
ఉగాది పచ్చడిలో వేప పువ్వుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప ఆకులు, పువ్వులు పవిత్రతకు సంకేతం. ఇవి ఇంట్లో ఉంచడం వలన పరిసరాలు స్వచ్ఛంగా ఉండి, ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు.
తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కొత్త సంవత్సరానికి ముందు ఇంటికి తులసి మొక్కను తీసుకువస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, ప్రశాంతత, ఆనందం కలుగుతాయని చెబుతారు.
ఉగాది సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం చాలా మంది పాటించే సంప్రదాయం. ఇలా చేయడం వలన కొత్త సంవత్సరంలో ధనం, సంపద పెరుగుతాయని నమ్మకం.
లోహంతో చేసిన తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచితే శుభప్రదంగా భావిస్తారు. ఇది సానుకూల శక్తిని పెంచి ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుందని అంటారు.
శంఖం ఇంట్లో ఉంచడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా దక్షిణావర్తి శంఖం ఉగాది ముందు ఇంటికి తెచ్చుకుంటే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, సంపద పెరుగుతుందని విశ్వసిస్తారు.
నెమలి ఈకలను ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చాలా మంది నమ్మకం.
లాఫింగ్ బుద్ధా ప్రతిమను ఇంట్లో ఉంచితే ధనం, ఆనందం పెరుగుతాయని, ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు.
రాగి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి, మామిడి ఆకులు పెట్టి పైగా కొబ్బరికాయను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేస్తే అది శుభానికి సూచకం. ఇది ఇంట్లో మంచి శక్తిని తీసుకువస్తుందని భావిస్తారు.
ఉగాదికి ముందు వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలను ఇంటికి తీసుకురావడం శుభప్రదం. వినాయకుడు అడ్డంకులను తొలగిస్తాడు, లక్ష్మీదేవి సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం.
అరటి మొక్క, అరటి ఆకులు అభివృద్ధి, ఆరోగ్యం, సంతోషానికి సంకేతం. అందుకే చాలా మంది ఉగాది సమయంలో ఇంటిని అలంకరించడానికి వీటిని ఉపయోగిస్తారు.
కొత్త దుస్తులు కొత్త ప్రారంభానికి ప్రతీక. ఉగాది రోజున కొత్త దుస్తులు ధరించి దేవునికి పూజ చేసి ఉగాది పచ్చడిని తినడం ఆనవాయితీ.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)