లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిల దీక్ష ఉద్రిక్తంగా మారింది. దీక్షను భగ్నంచేసేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై నిరసన వ్యాక్తం చేశారు వైఎస్ షర్మిల. నిరుద్యోగి సునీల్‌నాయక్ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
వైఎస్ షర్మిల దీక్షకు 24గంటలు అనుమతించారు పోలీసులు. అయితే దీక్ష కొనసాగుతుండటంతో భగ్నం చేసేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుపడితే ఇంట్లోనైనా దీక్ష కొనసాగిస్తానని., ఎన్ని రోజులైనా తన నిరసన కొనసాగుతుందన్నారు షర్మిల. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని, తనకేదన్నా హాని జరిగితే అభిమానులు ఊరుకోరని హెచ్చరించారు వైఎస్ షర్మిల.
తెలంగాణ ప్రభుత్వంపై తన పోరాటం ఉధృతం చేస్తాననన్నారు వైఎస్ షర్మిల. త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. జులై8న పార్టీ ప్రకటన రోజే పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్ కలలుగన్న రాజ్యం వచ్చేదాకా తన పోరాటం కొనసాగుతుందన్నారు.
తోపులాటలో షర్మిల చేతికి గాయమైంది. ఫ్రాక్చర్ అయిందన్న అనుమానం వ్యక్తంచేశారు ఆమెను పరీక్షించిన వైద్యులు. అయితే ఎక్స్‌రే తీసుకునేందుకు నిరాకరించిన షర్మిలకు తల్లి విజయమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ్నించి కదలనంటూ షర్మిల నిరసన కొనసాగించారు. వైఎస్‌కి, తన బిడ్డలకు ప్రజలకోసం పోరాడటమే తెలుసని వైఎస్ విజయమ్మ అన్నారు.