విద్యార్థులతో జూమ్‌లో జరగాల్సిన చర్చ చివరకు రాజకీయ రచ్చగా మారింది. టీడీపీ పెట్టిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు ఎంట్రీ ఇచ్చారు. లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆలోపే ఆడియో, వీడియో కట్ అయ్యాయి. ఆ తర్వాత రాజకీయ విమర్శలు కంటిన్యూ అయ్యాయి. విద్యార్థులతో రాజకీయం చేస్తారా అంటూ ఇరువైపుల నుంచి డైలాగ్ వార్ జరిగింది. అప్పటి వరకు విద్యార్థులతో జరిగిన జూమ్ మీటింగ్‌లోకి ఒక్కసారిగా వైసీపీ నేతలు ఎంట్రీ ఇచ్చారు. ఒకే చోట నుంచి ఒకరి తర్వాత మరొకరు లోకేష్‌తో జూమ్ మీటింగ్‌లోకి వెళ్లారు. టెన్త్ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ తక్కువగా రావడంతో విద్యార్థులతో జూమ్ మీటింగ్ పెట్టారు లోకేష్. అది మొదలైన పావు గంట తర్వాత ఓ విద్యార్థికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే వీడియోలోకి సడన్‌గా వల్లభనేని వంశీ వచ్చారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి వైసీపీ నేత దేవేందర్‌రెడ్డి జూమ్ మీటింగ్‌లోకి వచ్చారు. విద్యార్థులతో రాజకీయం చేస్తారా అంటూ దేవేందర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన వీడియో, ఆడియో ఆగిపోయాయి. విద్యార్థులతో పవిత్ర కార్యక్రమం నిర్వహిస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా అని మండిపడ్డారు లోకేష్. జూమ్ మీటింగ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ వచ్చిన స్క్రీన్ షాట్స్‌ను లైవ్‌లోనే చూపించారు లోకేష్. దమ్ముంటే నేరుగా చర్చకు రావాలని సవాల్ చేశారు.
తమ ప్రశ్నలకు జూమ్‌లో ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. విద్యార్థులు ఇబ్బందుల్లో ఉంటే వారితో రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. లోకేష్ విమర్శలకు వల్లభనేని వంశీ కూడా రియాక్ట్ అయ్యారు. దాన్ని పిల్లలకు వివరించి, వారిలో ఆత్మస్థైర్యం పెంచే విధంగా చూడాలి తప్ప, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా ఉండకూడదు. పిల్లలతో అలా రాజకీయాలు ఎందుకు? పిల్లల పేపర్లు దిద్దేది ఎవరు? ఉపాధ్యాయులు. వారు ఉన్నత విద్యావంతులు. నిపుణులు. వారు పేపర్లు దిద్దుతారు. అంతేకానీ ప్రభుత్వం, అధికారులు కాదు కదా? అయినా ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేస్తున్నారు? జూమ్ కాల్‌కు మేము వెళ్లాము. ఎందుకంటే ఇదే విషయం చెప్పడానికి. లోకేష్‌కు ధైర్యం ఉంటే, మాతో మాట్లాడొచ్చు కదా? ఆయన తన ముందు స్క్రిప్ట్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అందుకే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక, మేము కాన్ఫరెన్స్‌లోకి పోగానే లైన్ కట్ చేశాడు.
టీడీపీ నేత నారా లోకేశ్ పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించేందకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదని స్పష్టం చేశారు. తన మేనల్లుడి ఐడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. విద్యార్థి మేనమామతో లోకేశ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టారని తెలిసిన వైసీపీ నేతలు కావాలనే అందులోకి వెళ్లారు. విజయవాడ ఆఫీస్‌లో తమకు తెలిసిన విద్యార్థులతో లాగిన్ చేయించి లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారి తీరును తీవ్రంగా తప్పుబడుతోంది టీడీపీ.