విజయవాడ: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ పవన్‌పై ప్రసంశల వర్షం కురిపించారు.
భారీగా డబ్బులు వెచ్చించకుండా రాజకీయాల్లో గెలవలేమన్న అభిప్రాయం ప్రస్తుతం నెలకొని ఉందని తెలిపారు. డబ్బులు లేకుండానే రాజకీయం చేయొచ్చని నిరూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని వ్యాఖ్యానించారు.
కొందరిలో జ్ఞానం ఉంటుందనీ, మరికొందరిలో ఆత్మ విశ్వాసం ఉంటుందని, ఇంకొందరిలో జనాదరణ ఉటుందని, అయితే ఈ మూడు లక్షణాలున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. సినీపరిశ్రమలో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం పవన్ వదులుకున్నారని చెప్పారు. పవన్ మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తాము. దేశాన్ని మారుద్దాం.. జనసేన అంటే ఏంటో చూపిద్దాం.. జైహింద్ అంటూ జేడీ లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని ముగించారు.