ఎమ్మెల్యే అదితిసింగ్‌పై బామ్మ రుసరుసలు

అత్తలను వేధించుకుతింటున్న కోడళ్లను చూశాం.. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేపుకుతింటున్న కొడుకులను చూశాం! కానీ ఆస్తి కోసం బామ్మను వేధించే మనవరాలిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం.. ఆ మనవరాలు మామూలు వ్యక్తి కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే అదితిసింగ్‌పై బామ్మ రుసరుసలు

Edited By:

Updated on: Aug 27, 2020 | 5:56 PM

అత్తలను వేధించుకుతింటున్న కోడళ్లను చూశాం.. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేపుకుతింటున్న కొడుకులను చూశాం! కానీ ఆస్తి కోసం బామ్మను వేధించే మనవరాలిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం.. ఆ మనవరాలు మామూలు వ్యక్తి కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ఎమ్మెల్యే.. అంతటి బాధ్యతలను నిర్వర్తిస్తున్న అదితి సింగ్‌పై బామ్మ కమలాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. డబ్బు కోసం తనను హింసపెడుతున్నదని పోలీసులకు రాతపూర్వకంగా కంప్లయింట్‌ చేశారు.. కమలాసింగ్‌ చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు కూడా మొదలు పెట్టారు.. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది తెలుసుకునే బాధ్యతను అడిషనల్‌ ఎస్పీ నిత్యానందరాయ్‌కు అప్పగించామని ఎస్పీ స్వప్నిల్‌ మాంగేన్‌ చెప్పారు. అయితే గమనించాల్సిన విషయమేమిటంటే ఇప్పటి వరకు ఫిర్యాదుదారు, ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయకపోవడం…!

మహరాజ్‌గంజ్‌లోని లాలుపూర్‌ గ్రామంలో నివసిస్తుంటారు కమలాసింగ్‌.. 85 ఏళ్ల ఆమెను అదితీసింగ్‌, ఆమె బంధువులు బెదిరిస్తున్నారట! పోయిన డిసెంబర్‌ 30న ఆమె ఇంట్లోకి చొరబడి ఆస్తి మొత్తం రాసివ్వాలంటూ నానా గొడవ చేశారట! ఆస్తి రాసివ్వకపోతే అంతుచూస్తామంటూ హెచ్చరించారట! ఇవన్నీ కమలాసింగ్‌ తన కంప్లయింట్‌లో రాసిచ్చారు.. ఇంత జరిగినా అదితి సింగ్‌ నోరు విప్పకపోవడం గమనార్హం.. స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు అందినప్పటికీ ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం కూడా గమనించదగ్గ విషయమే!

అదితిపై వస్తున్న ఆరోపణలకు రాజకీయరంగు పులుముకుంది.. ఇటు కాంగ్రెస్‌ పార్టీ, అటు బీజేపీ మాటలతో కొట్టుకుంటున్నాయి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న అదితి సింగ్‌కు ఆ లక్షణాలన్నీ వచ్చేశాయని కాంగ్రెస్‌ అంటుంటే.. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేయడం తగదని బీజేపీ కౌంటర్‌ ఇస్తోంది.. అదితిసింగ్‌ కాంగ్రెస్‌ గుర్తు మీదనే గెలిచినప్పటికీ ఆ పార్టీ పట్ల విధేయత కనబర్చకుండా అనేక రకాల విమర్శలు చేయసాగారు.. దాంతో కాంగ్రెస్‌ ఆమెను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. ఇక అప్పటి నుంచి బీజేపీకి చేరువయ్యారు అదితి సింగ్‌..