AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

దేశ యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక కార్యాచరణ చేపట్టిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2029 నాటికి భారతదేశాన్ని డ్రగ్స్‌ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. యువత దేశానికి అతిపెద్ద ఆస్తి అని, అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిసలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Union Minister Kishan Reddy
Balaraju Goud
|

Updated on: Nov 21, 2026 | 8:26 PM

Share

హైదరాబాద్: దేశ యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక కార్యాచరణ చేపట్టిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2029 నాటికి భారతదేశాన్ని డ్రగ్స్‌ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. యువత దేశానికి అతిపెద్ద ఆస్తి అని, అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిసలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ మెగా సదస్సుకు కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ యువతను మాదకద్రవ్యాల ఉచ్చులోకి నెట్టేందుకు విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. డ్రగ్స్‌ ప్రభావంతో యువత తమ విచక్షణ కోల్పోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య తీవ్ర నష్టాన్ని కలిగించిందని, ఇప్పుడు హైదరాబాద్‌లోనూ డ్రగ్స్‌ విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో మూతపడిన కొన్ని కంపెనీల్లో డ్రగ్స్‌ తయారీ జరుగుతోందని, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులపైనే గంజాయి మొక్కలు పెంచుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో ఐటీ నిపుణులు, విద్యావంతులు, మేధావులు, యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రభుత్వాలు, పోలీసుల వల్లే ఈ సమస్యను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తును కాపాడటమే డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో ప్రధాన లక్ష్యమని, 2029 నాటికి డ్రగ్స్‌ రహిత భారత్‌ నిర్మాణానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us